iDreamPost
android-app
ios-app

వెంకట కృష్ణ ,రాధాకృష్ణ మధ్య సయోధ్య .. ఏబీఎన్ లో రీ ఎంట్రీ

  • Published Mar 25, 2021 | 3:54 PM Updated Updated Mar 25, 2021 | 3:54 PM
వెంకట కృష్ణ ,రాధాకృష్ణ మధ్య సయోధ్య .. ఏబీఎన్ లో రీ ఎంట్రీ

వెంకట కృష్ణ పునఃప్రవేశం జరిగిపోయింది. మళ్లీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పటి వరకూ అన్ని చానెళ్ళలోనూ వెనక్కి రావడమే మళ్లీ ప్రవేశించిన దాఖలాలు లేని పర్వతనేని వెంకటకృష్ణ తొలిసారిగా ఏబీఎన్ నుంచి బయటకు వచ్చి, రీ ఎంట్రీ ఇవ్వడం విశేషంగా మారింది. వీకే తొలుత ఏబీఎన్ ని వీడడమే పెద్ద చర్చకు దారితీసింది. అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి. పలు మీడియా కథనాలు అవినీతి ఆరోపణలు, ఆధిపత్య పోరు వంటివి ప్రస్తావించారు.

తొలుత నాలుగు రోజుల క్రితం అనూహ్యంగా తాను సెలవుపై వెళుతున్నానంటూ వీకే ఆ సంస్థ సిబ్బంది గ్రూపులో పోస్టులో చేశారు. అంతా సాధారణ సెలవుగానే భావించారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే అతన్ని గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు. దాంతో అది పెద్ద చర్చనీయాంశం అయ్యింది. విషయం వెలుగులోకి రావడంతో మీడియా వర్గాలతో పాటుగా, రాజకీయ నేతల్లో చర్చకు దారితీసింది.

Also Read:గంటా శ్రీనివాసరావు స్పీకర్ ను ఎందుకు కలిశారు?

అదే సమయంలో వీకే కూడా స్పందించారు. తన మీద కొందరు కావాలని చేస్తున్న దుష్ప్రచారం అంటూ పోస్ట్ చేశారు. తన చుట్టూ సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేయత్నం చేశారు. అయితే ఆయన్ని ఏబీఎన్ గ్రూప్ నుంచి తొలగించడంతో అతని తదుపరి స్టెప్ ఏమయి ఉంటుందా అనే చర్చ సాగింది. అంతా జరిగి నాలుగు రోజులు ముగిసేలోగా వారం రోజుల పాటు సెలవుపై వెళుతున్నానని చెప్పిన వీకే మళ్లీ హఠాత్తుగా ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. గురువారం మధ్యాహ్నం ఆఫీసులో కనిపించిన తర్వాత సాయంత్రానికి మళ్లీ వాట్సాప్ గ్రూపులో కూడా ఆయన పేరు చేర్చేశారు.

ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందోననే చర్చ మళ్లీ ముందుకొచ్చింది. వారం రోజుల సెలవు అని చెప్పి మళ్లీ నాలుగురోజులకే వెనక్కి రావడం, గ్రూప్ నుంచి సెలవుపై వెళ్లిన వ్యక్తిని తొలగించి, మళ్లీ యాడ్ చేయడం అంతా సందేహాలకు తావిస్తోంది. అయితే తెరవెనుక రాజకీయాలతో వీకే రీ ఎంట్రీకి ఛాన్స్ వచ్చిందనే వాదన ఉంది. ముఖ్యంగా ఈ ఉదంతం టీడీపీ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. టీడీపీకి అనుకూలంగా ఉండే చానెల్ నుంచి చంద్రబాబు మద్ధతుదారుడైన జర్నలిస్ట్ ని సాగనంపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో టీడీపీ కి చెందిన ఓ యువనేత స్వయంగా జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. అతని చొరవ కారణంగానే ఆర్కే, వీకే మధ్య సర్థుబాటు జరిగిందని చెబుతున్నారు. ఇకపై ఆర్కే, వీకే తమ పరిధుల్లో సంస్థ వ్యవహారాలు చూసుకునేలా ఓ అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీకి మీడియాలో ఉన్న అనుకూల వర్గంలో నైతికస్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేకుండా ఇలాంటి ప్రయత్నం జరిగి ఉంటుందనే వాదన సాగుతోంది.

Also Read:సూయిజ్ కాలువలో సునామీ