iDreamPost
iDreamPost
హత్తుకునే భావోద్వేగాలకు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద పీఠ వేస్తారు. తమకు నచ్చేలా హృదయాలు మెచ్చేలా ఉంటే కాసుల వర్షం కురిపిస్తారు. అందులో స్టార్స్ ఉన్నారా లేదా అనవసరం. ఉంటే అదో అదనపు లాభం. ఓ చక్కని ఉదాహరణ చూద్దాం. 1975. కలర్ సినిమాల రాజ్యం మొదలైనప్పటికీ బడ్జెట్ సమస్యల వల్ల ఇంకా బ్లాక్ అండ్ వైట్ లోనే తీసేవాళ్ళే ఎక్కువ. అందులోనూ సెంటిమెంట్ చిత్రాలకు ఈ టెక్నాలజి ఎందుకనుకునే వాళ్ళు. కానీ ఆ కామెంట్ ని బ్రేక్ చేస్తూ వచ్చిన మూవీ జీవన జ్యోతి. నిర్మాత డివిఎస్ రాజు అప్పటికి ఎన్టీఆర్ తో ఆరు సినిమాలు తీశారు. అన్నీ సూపర్ హిట్లే. ఏడోది కూడా ప్లాన్ చేసుకున్నారు.
దర్శకులు కళాతపస్వి కె విశ్వనాథ్ గారి కథకు రాజుగారు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ వయసు ప్లస్ ఇమేజ్ దృష్ట్యా అది తనకు అంతగా నప్పదని అన్నగారు చెప్పడంతో ఇది కాస్తా శోభన్ బాబుని వరించింది. అప్పటికే ఆయన రంగుల చిత్రాల్లో మాత్రమే నటించేందుకు సైన్ చేస్తున్నారు. అలా జీవన జ్యోతి పట్టాలెక్కింది. ఇది రచయిత్రి రామలక్ష్మి రాసిన ఓ నవల ఆధారంగా విశ్వనాథ్ గారు కొన్ని కీలక మార్పులతో రాసుకున్నారు. సముద్రాల జూనియర్ సంభాషణలు సమకూర్చగా కెవి మహదేవన్ మధురమైన బాణీలు సిద్ధం చేశారు. జికె రాము ఛాయాగ్రహణం, బాబురావు ఎడిటింగ్ విభాగాలు నిర్వహించారు. బడ్జెట్ పదిహేడు లక్షల దాకా అయ్యింది.
శోభన్ బాబు వయసు మళ్ళిన వాడిగా, యువకుడిగా రెండు షేడ్స్ లో కనిపిస్తారు. డ్యూయల్ రోల్ కాదు కానీ తన వయసుని ఛాలెంజ్ చేసే క్యారెక్టర్ ని చక్కగా పోషించారు. వాణిశ్రీకి ద్విపాత్రభినయం చేసే అవకాశం దక్కింది. సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ, బేబీ వరలక్ష్మి, అల్లు, నిర్మలమ్మ ఇతర తారాగణం. తనది కానీ బిడ్డ మీద విపరీతమైన ప్రేమను పెంచుకున్న ఓ తల్లి కథగా విశ్వనాథ్ దీన్ని తెరకెక్కించిన తీరు జనాన్ని బాగా కదిలించింది.1975 మే 16న విడుదలైన జీవన జ్యోతి 12 కేంద్రాల్లో వంద రోజులు ఆడటం రికార్డే. శోభన్ బాబు, వాణిశ్రీలకు నెలల తరబడి అవార్డుల వర్షం కురిసింది. విశ్వనాథ్ అందించిన ఆణిముత్యాల్లో స్థానం సంపాదించుకుంది
Also Read : Raktha Sambandham : NTR టైటిల్ తో కృష్ణ ఎమోషనల్ డ్రామా – Nostalgia