iDreamPost
android-app
ios-app

జేసీ.. పెనం మీద నుంచి పోయ్యిలో పడ్డారు..!

జేసీ.. పెనం మీద నుంచి పోయ్యిలో పడ్డారు..!

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అశ్మిత్‌ రెడ్డిలకు ఉచ్చు బిగుస్తోందా..? ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా వాహనాలను విక్రయించిన కేసులో వారు పూర్తిగా ఇరుక్కుపోయారా..? రాజకీయ కక్షతోనే తమపై కేసులు పెట్టారని చేసిన విమర్శలు తేలిపోయాయా..? చంద్రబాబు అండ్‌కో చేసిన విమర్శలు అన్నీ రాజకీయ రాద్ధాంతమేనని తేలిపోయిందా..? అంటే తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు విన్నవారి నుంచి ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తోంది. రాజకీయ కక్షతో తమపై వైసీపీ సర్కార్‌ కేసులు పెట్టిందని, బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన జేసీ ప్రభాకర్‌ రెడ్డికి నిన్న ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్‌ రాకపోగా.. ఈ కేసులో వారి ప్రమేయం వంద శాతం ఉందని, నేరం జరిగిందని హైకోర్టు వ్యాఖ్యలతో అందరికీ తెలిసిపోయింది.

బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తాము ఉత్తర్వులు ఇస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పిన హైకోర్టు.. బెయిల్‌ కోసం కింది కోర్టుకు వెళ్లడం ఉత్తమమని సూచించింది. సుప్రీం కోర్టు బీఎస్‌ 3 వాహనాలను నిషేధించిందని, వాటిని బీఎస్‌ 4 వాహనాలుగా మార్చి అక్రమ రిజిస్ట్రేషన్‌ ద్వారా ఎలా విక్రయిస్తారని ప్రశ్నించింది. సుప్రిం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆక్షేపించింది. ఇలాంటి వాహనాలు ప్రమాదానికి గురై ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిదని హైకోర్టు నిలదీసింది. మీపై ఆరోపణలు చాలా తీవ్రమైనవని న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. వెంకటరమణ వ్యాఖ్యానించారు. దీంతో న్యాయమూర్తి అనుమతి మేరకు బెయిల్‌ పిటిషన్‌ను జేసీ ఉపసంహరించుకున్నారు.

బెయిల్‌ కోసం దిగువ కోర్టుకు వెళ్లడం ఉత్తమమని హైకోర్టు సూచించినా.. జేసీకి ఆ అవకాశం లేనట్లే. హైకోర్టుకు వెళ్లకముందు వారు.. బెయిల్‌ కోసం అనంతపురం జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం బెయిల్‌ను తిరస్కరించింది. ఆ తర్వాతే జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుటుంబీకులు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బెయిల్‌ వస్తుందని ఆశించగా.. అది రాకపోగా ఈ కేసులో జేసీ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. ఒక వేళ జేసీ బెయిల్‌ కోసం కింది కోర్టులను ఆశ్రయించినా.. తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో అక్కడ బెయిల్‌ వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి చేసిన నేరం.. చాలా తీవ్రమైనదని, తాము విచారించి ఆదేశాలు జారీ చేస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత కింది కోర్టు న్యాయమూర్తులు ఆ వాఖ్యలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారని చెబుతున్నారు.

ఈ కేసులో ఉపసమనం పొందేందుకు చట్టపరంగా, న్యాయపరంగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడుకు ఉన్న అవకాశాలు పూర్తిగా సన్నగిల్లగా.. రాజకీయంగానూ వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకూ ఈ కేసు రాజకీయ కక్షతో పెట్టారంటూ జేసీ కుటుంబం, టీడీపీ నేతలు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. అయితే తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఆ విమర్శలన్నీ తేలిపోయాయి. పైగా వారు నేరం చేసినట్లు హైకోర్టే వ్యాఖ్యానించడం జేసీ రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా ఉపయోగపడే అవకాశం ఉంది. హైకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులు జేసీని టార్గెట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద హైకోర్టు వ్యాఖ్యలతో జేసీ పరిస్థితి పెనం మీద నుంచి పోయ్యిలో పడినట్లైంది.