iDreamPost
android-app
ios-app

టీడీపీదే తాడిపత్రి.. మరోసారి చైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

టీడీపీదే తాడిపత్రి.. మరోసారి చైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

గోడవలు లేవు, ఉద్రిక్త పరిస్థితులు లేవు. కొట్లాటలు అంతకన్నా లేవు. అధికార దుర్వినియోగం లేదు, ట్విస్ట్‌లు లేవు.. అత్యంత ప్రజా స్వామికంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌,  వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరిగింది. ప్రజా తీర్పునకు అనుగుణంగానే తాడిపత్రిలో పురపాలక మండలి ఏర్పాటైంది. మున్సిపల్‌   చైర్మన్‌ పీఠాన్ని టీడీపీ గెలుచుకుంది. మరోసారి జేసీ ప్రభాకర్‌ రెడ్డి చైర్మన్‌ పీఠాన్ని అధిరోహించారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో 36 వార్డులున్న తాడిపత్రిలో రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ 18 వార్డులు, వైసీపీ 14 వార్డులను గెలుచుకున్నాయి. టీడీపీ మిత్రపక్షమైన సీపీఐ ఒక వార్డులో, స్వతంత్ర అభ్యర్థి మరొక వార్డులోనూ గెలుపొందారు. మొత్తం మీద 36 వార్డులకు గాను వైసీపీ 16, టీడీపీ 18, సీపీఐ 1, స్వతంత్రులు 1 వార్డును గెలుచుకున్నారు.

Also Read : వైసీపీదే మైదుకూరు మున్సిపాలిటీ.. పోటీకి ముందే చేతులెత్తేసిన టీడీపీ..

ఏ పార్టీకి సగం కన్నా ఎక్కువ వార్డులు రాకపోవడంతో మున్సిపల్‌ చైర్మన్‌పీఠం ఎవరు గెలుచుకుంటారన్న ఉత్కంఠ ఏర్పడింది. టీడీపీకి 18 వార్డులు ఉండగా, వైసీపీకి 16 వార్డులతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్‌ అఫిషియో ఓట్లతో ఆ పార్టీ బలం 18కి చేరుకుంది. ఎమ్మెల్సీలకు ఎక్స్‌ అఫిషియో ఓట్లను కమిషనర్‌ తిరస్కరించారు. దీంతో సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి కీలకంగా మారారు. సీపీఐ.. టీడీపీ మిత్రపక్షం కాబట్టి ఆ పార్టీ కౌన్సిలర్‌ టీడీపీకే మద్ధతు ఇవ్వడం ఖాయమైంది. అయితే స్వతంత్ర అభ్యర్థి కూడా టీడీపీ వైపే మొగ్గు చూపారు. స్వతంత్ర అభ్యర్థి వైసీపీకి మద్ధతు ఇచ్చి ఉంటే.. ఇరు పార్టీల బలం 19 చొప్పన సరిసమానంగా వచ్చేవి. అప్పుడు టాస్‌ ద్వారా చైర్మన్‌ ఎన్నిక నిర్వహించేవారు. అయితే ఇలాంటి ట్విస్ట్‌లు ఏమీ లేకుండానే సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్ధతుతో టీడీపీ మున్సిపల్‌ పీఠాన్ని గెలుచుకుంది.

టీడీపీ ప్రభుత్వ హాయంలో మాదిరిగా.. బలంలేకపోయినా మేయర్, చైర్మన్‌పీఠాలను, జడ్పీ చైర్మన్‌ పోస్టులను గెలుచుకునేందుకు వైసీపీ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడకపోవడం విశేషం. ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నిక జరగాలనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆలోచన మేరకు.. స్థానిక నేతలు నడుచుకున్నారు. పోలింగ్‌ జరిగే వరకూ తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. చైర్మన్‌ ఎన్నిక సమయంలో జరగకపోవడానికి అధికార పార్టీ పాటించిన విధానమే ప్రధాన కారణంగా నిలుస్తోంది. ప్రజా స్వామ్యం పట్ల గౌరవంతో వ్యవహరించిన వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Also Read : ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో ఓటు తిరస్కరణ.. తాడిపత్రిలో ఏం జరగబోతోంది..?