iDreamPost
android-app
ios-app

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అరెస్ట్

  • Published Jun 13, 2020 | 2:12 AM Updated Updated Jun 13, 2020 | 2:12 AM
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అరెస్ట్

ఏపీలో పోలీసులు మరో కీలక నేతను అదుపులోకి తీసుకున్నారు. ఈసారి అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన తో పాటు మొన్నటి ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీకి టీడీపీ తరుపున బరిలో దిగిన జేసీ అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన వారిద్దరినీ అనంతపురం తరలిస్తున్నారు.

జేసీ ట్రావెల్స్ యజమానులుగా జేసీ బ్రదర్స్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన విషయంలో వారిపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. అయితే వాటిపై చర్యలు తీసుకోవడానికి గతంలో ప్రభుత్వాలు సిద్ధం కాలేదు. కానీ తాజాగా బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి రికార్డులు సృష్టించిన కేసులో మాత్రం ప్రభుత్వం చురుగ్గా స్పందించింది. వారిపై కేసు నమోదు చేసిన దరిమిలా తదుపరి చర్యలకు పూనుకుంది. నకిలీ దృవపత్రాలతో వాహనాలు నడిపిన కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని హైదరాబాద్ శంషాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. వారిని అనంతపురం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

Also Read: బాబు చెప్పినట్టు చేసినా, ఇంత హైరానా ఎందుకు?

ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్ లోకి తరలించిన మరునాడే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం తెరమీదకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన సోదరుడు దివాకర్ రెడ్డి చాలాకాలంగా నోటి దురుసు ప్రవర్తించే నేతలుగా పేరు గడించారు. అధికారులు, తమకు గిట్టని నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేయడంలో సిద్ధహస్తులు, అదే క్రమంలో అధికారంలో ఉన్న వారితో తమకు అనుకూలంగా పనులు చేయించుకోవడంలో సమర్థులనే గుర్తింపు ఉంది. కృష్ణా జిల్లాలో జేసీ ట్రావెల్స్ బస్సులో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోలేదు. దానిపై జగన్ విపక్ష నేతగా ఉన్న సమయంలో ఆందోళన కూడా నిర్వహించారు.

ఈ కేసులో ప్రభాకర్ రెడ్డి బార్య జేసీ ఉమారెడ్డి మీద కూడా రవాణా శాఖ అధికారుల ఫిర్యాదుతో ఛీటింగ్ కేసు నమోదయ్యింది. గత ఫిబ్రవరిలోనే 66 లారీలకు సంబంధించిన రికార్డులు తారుమారు చేసి నడుపుతున్నారని నేరం నమోదయ్యింది. 2017 నుంచి సాగుతున్న వ్యవహారంలో ఉమారెడ్డితో పాటుగా సి గోపాల్ రెడ్డి సహా పలువురు ఈ కేసులో సహా నిందితులుగా ఉన్నారు.

Also Read:తప్పు చేయలేదని చెప్పుకోవడం ఇలాగేనా బాబు..?

అయితే ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటుగా ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం ఆసక్తిగా మారింది. వారిపై ఫోర్జరీ సహా పలు కేసులు నమోదయిన తరుణంలో కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వరుసగా అక్రమాల్లో భాగస్వాములుగా ఉన్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకుంటున్న వైనం రాజకీయంగా కలకలం రేపుతోంది. టీడీపీ శిబిరంలో అలజడికి దారితీస్తోంది