iDreamPost
android-app
ios-app

ఈజీగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది జేసీ!

ఈజీగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది జేసీ!

తప్పు చేసిన వారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. పదే పదే తప్పులు చేస్తూ దొరికిపోతూ చట్టాన్ని, పోలీసులని నానా మాటలు అంటే చట్టాలు ఏమీ చూస్తూ ఉండవు. అందుకే అంటారు చట్టం తన పని తానూ చేసుకు పోతుందని… అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు వివాదాస్పదంగా ఉండే జేసీ సోదరులపై శనివారం మరో కేసు నమోదైంది. తమకు ఎలాంటి పదవులు, రాజకీయాలు వద్దని గంభీరంగా ప్రకటించిన జెసి సోదరులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీగా దాచి ఉంచిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్పర్శ కిట్.. బ్యాట్!

ఒక కేసు పూర్తయిన వెంటనే మరో కేసు పెట్టేలా పోలీసులకు అన్నీ హింట్ లు ఇస్తూ, దానికి అవసరం అయ్యే నేరాన్ని బహిరంగంగా చేస్తూ జెసి సోదరులు దాని నుంచి ప్రచారం పొందాలని తాపత్రయపడుతున్నారా లేక సానుభూతి పొందేందుకు ఆరాటపడుతున్నారా అన్నది అర్థం కావడం లేదు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో కోడ్ ఉల్లంఘిస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారని జేసీ ప్రభాకర్ రెడ్డి పై సెక్షన్ 188, 171 ప్రకారం కేసు నమోదు అయింది. ఇటీవల జేసీ ప్రభాకర్రెడ్డి కొన్ని క్రికెట్ కిట్లను మున్సిపల్ ఎన్నికల సందర్భంగా యువతకు పంచేందుకు తీసుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు జరిపిన సోదాల్లో స్పర్శ అని ముద్రించి ఉన్న బ్యాగులు లో భారీగా క్రికెట్ కిట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 130 క్రికెట్ కిట్ లను బెంగళూరు నుంచి తెప్పించి నట్లు తెలిసింది. ఇవి జేసీ ప్రభాకర్ రెడ్డి కి సంబంధించినవి గా భావించి ఆయన మీద కేసు నమోదు చేశారు.

ముందుగానే ఎందుకు?

మున్సిపల్ ఎన్నికల్లో తనను నామినేషన్ వేసేందుకు అనుమతించాలని ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో నామినేషన్లు వేసిన సందర్భంగా తనను అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేసి అడ్డుకున్నారని ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దానిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే మరోపక్క ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకుండానే జేసీ ప్రభాకర్రెడ్డి తన ఎన్నికల ప్రచారానికి, ఓటర్లను ప్రలోభ పెట్టెందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం విశేషం.

సమాచారం ఇస్తుంది ఎవరు?

జెసి ప్రభాకర్ రెడ్డి విషయంలో ప్రతి విషయాన్ని పోలీసులకు అత్యంత పటిష్టంగా అమలు చేస్తున్నది ఎవరు అన్నది కీలకంగా మారింది. ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసుల కళ్ళు గప్పి మరీ చట్ట విరుద్ధ పనులకు జేసీ ప్రయత్నిస్తుండటంతో పాటు ఆయన వద్ద పనిచేసే వారే సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారు అన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం తమను కావాలని వేధిస్తోందని, ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని ప్రచారం చేయడంలో భాగంగానే ఈ స్కెచ్ వేస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసులు పదేపదే హెచ్చరికలు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా జేసీ సోదరులు నోటికి, చేతలకు పని చెప్పి పోలీసు కేసుల వరకు రావడంలో ఆంతర్యం ఇదేనన్న వాదన వినిపిస్తోంది.