iDreamPost
iDreamPost
మనం ప్రేమిస్తే సరిపోదు తమ్ముడు.. ఎదుటివారు కూడా ప్రేమించాలి.. అలా కానప్పుడు అది వన్ సైడ్ లవ్ అవుతుంది.. అంటూ కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ చర్చ జరుగుతోంది. అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయని.. ఆ తర్వాత తన వన్ సైడ్ లవ్ పై సన్నాయి నొక్కులు కూడా నొక్కారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కొని గెలవడం తనవల్ల కాదని చంద్రబాబుకు చాన్నాళ్ల క్రితమే అర్థం అయ్యింది. అందుకే గత మహానాడు నుంచి బీజేపీని దువ్వడం ప్రారంభించారు. అయితే కమలనాథులు ఛీ కొట్టడంతో బాబుకు తన అజ్ఞాత మిత్రుడు పవన్ ఒక్కరే దిక్కయ్యారు. అందులో భాగంగానే జనసేనతో పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు ‘వన్ సైడ్ లవ్’ వ్యాఖ్యలతో సంకేతాలు పంపారు. కానీ జనసేన నేతల నుంచి చంద్రబాబుకు దిమ్మదిరిగే కౌంటర్లు వస్తున్నాయి. తమ నేత పవన్ కళ్యాణ్ ను వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా? అని జనసేనలో ముఖ్య నాయకుడిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించడం విశేషం.
నాడు మిమ్మల్ని సీఎం చేశాం.. ఇప్పుడు పవన్ కు అవకాశం ఇవ్వండి
టీడీపీ, జనసేన అధినేతల మధ్య మొదటి నుంచీ అజ్ఞాత స్నేహం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసినా పలు నియోజకవర్గాల్లో అంతర్గత సహకారం కొనసాగింది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా బహిరంగంగానే కోరుతున్నారు. చంద్రబాబు వన్ సైడ్ వ్యాఖ్యలపై పవన్ స్పందించకపోయినా జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రం కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందిస్తూ టీడీపీ పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ పొత్తు కావాలని టీడీపీ కోరుకుంటే తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన షరతు పెట్టారు. అలా ప్రకటించగలరా అని చంద్రబాబును ప్రశ్నించారు. బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలను జనసైనికులు అందిపుచ్చుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఇదే ప్రశ్నను టీడీపీ పైకి సంధిస్తున్నారు.
చంద్రబాబును సీఎం చేయడం మా లక్ష్యం కాదు
రాష్ట్రంలో జగన్ ను సీఎం పదవి నుంచి దించి చంద్రబాబును గద్దె ఎక్కించడం జనసేన లక్ష్యం కాదని బొలిశెట్టి స్పష్టం చేశారు. 2014లో పార్టీ కొత్తగా ఏర్పాటు కావడం, విభజన గాయాలతో ఉన్న రాష్ట్రానికి అనుభవజ్ఞుడు సీఎం అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో అప్పటి ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు సీఎం అయ్యేందుకు సహకరించాము కనుక 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి టీడీపీ మద్దతు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు పొత్తుల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. మరోవైపు రెండేళ్లలో తానే సీఎం అవుతానని ఎలా ప్రకటించుకుంటున్నారని ప్రశ్నించారు. పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు కుదిరాక.. కూటమిలో ఉన్న పార్టీలు కలిసి చర్చించుకుని సీఎం అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మరి చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ అంశాలపై స్పందిస్తారా అంటే అనుమానమే.
Also Read : కుప్పంలో బాబుకు జ్ఞానోదయం !