iDreamPost
iDreamPost
“జై భీమ్” సినిమాతో అందరి మన్ననలూ అందుకున్న TJ జ్ఞానవేల్ (TJ Gnanavel) ఇప్పుడు మరో నిజ జీవిత గాథను తెరకెక్కించనున్నాడు. అదీ తమిళ్ లో కాదు హిందీలో! పేరు “దోశా కింగ్”! శరవణ భవన్ వ్యవస్థాపకుడు పి. రాజగోపాల్ ఉరఫ్ దోశా కింగ్ అమ్మాయిల పిచ్చి, జాతకాల పిచ్చితో తన దగ్గర పని చేసే ఉద్యోగి కూతురు బతుకును ఎలా నాశనం చేశాడనేదే ఈ సినిమా మెయిన్ థీమ్!
శరవణ భవన్ రెస్టారెంట్ చెయిన్ యజమానిగా పిచ్చై రాజగాపాల్ కు మంచి పేరుండేది. 20కి పైగా దేశాల్లో రెస్టారెంట్లు స్థాపించిన రాజగోపాల్ ను అందరూ ఫ్యామిలీ మ్యాన్ అని పొగిడేవారు. కానీ మనసుపడ్డ ఆడదాన్నిసొంతం చేసుకుని తీరాల్సిందేనన్న అతని పట్టుదల మంచి పేరును మింగేసి చివరికి అతని చావుకు కారణమైంది. రాజగోపాల్ దగ్గర పని చేసే ఓ ఉద్యోగి కూతురు జీవజ్యోతి శాంతకుమార్. ఆమెను మూడో పెళ్ళి చేసుకుంటే తన దశ తిరిగిపోతుందని జ్యోతిష్యుడు చెప్పాడంటూ రాజగోపాల్ ఆమె వెంటపడ్డాడు. కానీ అప్పటికే పెళ్ళైన జీవజ్యోతి అతణ్ణి కాదంది. అయినా అతను వినలేదు. ఆమెను భయపెట్టాడు. బెదిరించాడు. చివరికి 2001 అక్టోబర్ లో జీవజ్యోతి భర్త ప్రిన్స్ శాంతకుమార్ ను హత్య చేయించాడు. మద్రాసు హైకోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. కానీ అనారోగ్య కారణాలతో అతను బెయిల్ పై బయటికొచ్చాడు. మళ్ళీ సుప్రీం జోక్యంతో 2019లో పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకే చికిత్స పొందుతూ చనిపోయాడు. 18 ఏళ్ళపాటు జీవ జ్యోతి సాగించిన న్యాయ పోరాటాన్నే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్నాడు. తల్వార్, రాజీ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న జంగ్లీ పిక్చర్స్ (Junglee Pictures) బ్యానర్ లో ఈ సినిమా రాబోతోంది. సుదీర్ఘమైన తన పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు జీవజ్యోతి సంతోషం వ్యక్తం చేశారు. ఇలా అయినా నిజమేంటో అందరికీ తెలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. క్రైమ్ థ్రిల్లర్ ను తలపించే ఈ ఎపిసోడ్ పై ఇప్పటికే ఓ పుస్తకం వెలువడింది. నిరుపమ సుబ్రమణ్యం రాసిన ఈ పుస్తకం పేరు “Murder on the Menu”.