iDreamPost
iDreamPost
నిన్న అర్ధాంతరంగా కన్ను మూసిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం తాలూకు విషాదం ఇంకా సజీవంగా ఉంది. కాకతాళీయమే అయినా అదే రోజు స్వంత అన్నయ్య శివ రాజ్ కుమార్ కొత్త సినిమా భజరంగి 2(తెలుగులో జై భజరంగి)విడుదల కావడం అభిమానులను జీర్ణించుకోలేని శూన్యంలోకి తోసింది. ఉదయం నింగికెగసిన ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరయ్యింది. శివన్న కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ కి ఇక్కడ స్పందన తక్కువగా ఉన్నా కర్ణాటకలో తెల్లవారుఝాము నుంచే భారీ ఎత్తున ఓపెనింగ్స్ దక్కాయి. హర్ష దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం
2013లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భజరంగికి కొనసాగింపని జనం అనుకున్నారు నిజానికి ఆ కథకు దీనికి సంబంధం లేదు. పూర్తిగా వేరు. వయసైపోతున్నా పెళ్లి కాకుండా ఏకాకిగా మిగిలిన అంజి(శివ రాజ్ కుమార్)అక్కయ్యను ఆమె కుటుంబాన్ని అరుదైన మూలికలతో మత్తు మందులు తయారు చేసే మాఫియా ముఠా కిడ్నాప్ చేస్తుంది. ఏం చేయాలో అర్థం కానీ నిస్సహాయ స్థితిలో అంజి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుడు భజరంగి(శివరాజ్ కుమార్)ఆత్మ అతని శరీరంలోకి ప్రవేశిస్తుంది. ధన్వంతరి వైద్యాన్ని దుర్వినియోగం చేస్తున్న లోక వినాశకులను అంతం చేసేందుకు నడుం బిగిస్తుంది. తర్వాత ఏం జరిగిందనేది తెరమీద చూడాలి.
శివరాజ్ కుమార్ ఎప్పటిలాగే తన వయసుకి మించి పడిన కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. రెండు షేడ్స్ లో చక్కగా ఒదిగిపోయారు. దర్శకుడు హర్ష తీసుకున్న పాయింట్ మంచిదే అయినప్పటికీ గ్రాఫిక్స్ హంగుల మీద పెట్టిన ఫోకస్ అసలైన కథా కథనాల మీద పెట్టకపోవడంతో అనవసరమైన సన్నివేశాలు, సంబంధం లేని పాత్రలు చికాకు పెడతాయి. సెకండ్ హాఫ్ వచ్చేదాకా ఏం జరుగుతోందో కూడా అంతు చిక్కదు. మొదటి భాగంలో పండిన ఎమోషన్స్, విలన్ ట్రాక్ ఇందులో అంతగా సెట్ కాలేదు. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే మ్యాటర్ ఉన్నప్పటికీ టేకింగ్ లోపాల వల్ల జై భజరంగి యావరేజ్ కంటే ఓ మెట్టు కిందే ఆగిపోయింది
Also Read : Family Drama : ఫ్యామిలీ డ్రామా రిపోర్ట్