iDreamPost
android-app
ios-app

తెలంగాణ కాంగ్రెస్ లో పాద‌యాత్ర‌ల క‌ల్లోలం – జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేస్తాడంట

తెలంగాణ కాంగ్రెస్ లో పాద‌యాత్ర‌ల క‌ల్లోలం – జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేస్తాడంట

తెలంగాణ లో పాదయాత్రల కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాదయాత్రను ప్రారంభించారు. ప‌లుమార్లు వాయిదాలు ప‌డిన‌ప్ప‌టికీ మొత్తానికి మొద‌లెట్టి విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్నారు. హుజూరాబాద్ లో ఈట‌ల రాజేంద‌ర్ చేప‌ట్టిన పాద‌యాత్ర మోకాలికి శ‌స్త్ర‌చికిత్స‌తో బ్రేక్ ప‌డింది. టీపీసీసీ చీఫ్ కాక ముందే రేవంత్ రెడ్డి రైతు భ‌రోసా పేరుతో పాద‌యాత్ర చేశారు. షర్మిల పార్టీ కూడా పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతోంది. బీఏస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పాదయాత్ర కు సిద్ధం అవుతున్నారు. అయితే.. పార్టీలో జోష్ నింపే పాద‌యాత్ర‌.. కాంగ్రెస్ లో మాత్రం ప్ర‌స్తుతం క‌ల్లోలం రేపుతోంది. టీపీసీసీ చీఫ్ అయ్యాక‌.. పాద‌యాత్ర చేస్తానంటూ అంద‌రి కంటే ముందుగానే రేవంత్ ప్ర‌క‌టించారు. అయితే ప్రారంభానికి ముహూర్తం కుద‌ర‌డం లేదు. దీనికి అనేక కార‌ణాలు ప్ర‌చారంలో ఉన్నాయి.

కాంగ్రెస్ నేతలు మాత్రం అందరికంటే ముందే పాదయాత్ర చేస్తామని ప్రకటించినా దాన్ని ఆచరణ కార్యాచరణ ఎక్కడ కనిపించడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ అయ్యాక పాదయాత్ర చేస్తానని కీలక ప్రకటన చేశారు. అయితే ఎప్పుడు చేస్తాననేది మాత్రం చెప్పలేదు. అంతర్గత కుమ్ములాటలు ఇతర నాయకుల సహకారం లేకపోవడం వల్ల ప్రస్తుతానికి పాదయాత్ర కి బ్రేక్ పడిందని చెప్తున్నారు. దీనికి తోడు మరోనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భువనగిరి నుంచి పాదయాత్ర చేస్తా అన్నారు. ఆ నేత పాదయాత్ర కూడా కేవలం మాటలకే పరిమితం అయింది. ఇక మరో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేస్తా అని ప్రకటించారు. ఈ ముగ్గురు కాంగ్రెస్ నేతలు పాత‌యాత్ర చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఆయా నేత‌లు పాద‌యాత్ర‌ల అనుమ‌తికి అధిష్ఠానానికి స‌మాచారం ఇచ్చారు. అయితే.. ఎవ‌రికి ఊ కొట్టాలో, ఎవ‌రికి వ‌ద్ద‌ని చెప్పాలో తెలియ‌క అధిష్ఠానం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంద‌ట‌. రేవంత్ చీఫ్ అయ్యాక ఇప్ప‌టికీ ఆయ‌న‌కు, కోమ‌టిరెడ్డికి మ‌ధ్య సఖ్య‌త లేద‌ని ప‌లు విష‌యాల్లో స్ప‌ష్ట‌మైంది. పాద‌యాత్ర కోసం ఇద్ద‌రు కూడా హైకమాండ్ అనుమ‌తి కోరుతున్నార‌ట‌. రాబోయేకాలంలో అధికారం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ .. ఇప్పుడు ఎవ‌రికి వారు య‌మునా తీరే అన్న చందంగా పాద‌యాత్ర‌లు చేస్తే అది పార్టీకి న‌ష్ట‌మే కానీ, లాభం ఉండ‌ద‌ని అధిష్ఠానం భావిస్తోంది. దీనిపై ముందుగా స‌ఖ్య‌త ఏర్ప‌రిచి పాద‌యాత్ర‌పై ఆలోచించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం పాదయాత్రలపై ఇప్పటికే అధిష్టానం కి సమాచారం అందించాం అని హైకమాండ్ పర్మిషన్ కోసం చూస్తున్నామని ఆ అనుమతి రాగానే మొదలుపెడతాం అని చెబుతున్నారు.

ఓ వైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రతో దూసుకుపోతుంటే ముచ్చటగా ముగ్గురు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తామని ప్రకటించి ఎవ‌రూ ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ ప్రారంభించ లేదు. అధికారం సాధించాలంటే క‌లిసి పోరాడాలి. కానీ.. ఇప్పుడు కూడా ఎవ‌రికి వారు తామంటే తాము పాద‌యాత్ర చేస్తామంటున్నారు కానీ.. ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ రూపొందించ‌డం లేదు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ లో సంక్షోభానికి దారి తీస్తోంది. మ‌రి దీనిపై హైక‌మాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.