iDreamPost
android-app
ios-app

బాబు బ‌కాయి పెట్టారు.. జ‌గ‌న్ చెల్లిస్తున్నారు..!

బాబు బ‌కాయి పెట్టారు.. జ‌గ‌న్ చెల్లిస్తున్నారు..!

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పారద‌ర్శ‌క‌త పాల‌న అందిస్తూ అంద‌రి అభిమానాలు చుర‌గొంటున్నారు. ఆయ‌న అవ‌లంబిస్తున్న విధానాలు ప్ర‌జ‌లకు, ఉద్యోగుల‌కు మేలు చేస్తున్నాయి. లాక్ డౌన్ కాలంలో కోత విధించిన జీతాల చెల్లింపులో చొరవ చూపిన జ‌గ‌న్ ఉద్యోగుల‌కు మ‌రో మేలు చేస్తున్నారు. గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెల్లించ‌ని బ‌కాయిల‌ను సైతం విడుద‌ల చేస్తున్నారు. ‌టీడీపీ సర్కారు ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించకుండా బకాయిపెట్టిన రెండు డీఏలను చెల్లించేందుకు తాజాగా రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌భుత్వంపై ఆరు వేల కోట్ల భారం

చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప్ర‌భుత్వంపై ఆరు వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా భారం ప‌డుతోంది. ఈ రెండు డీఏ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఏకంగా రూ.2,400 కోట్లకుపైనే భరించనుంది. ఈ రెండు డీఏల 30 నెలల తాలూకు బకాయిలు చెల్లించేందుకు రూ.6,034.80 కోట్ల మేర వ్యయం కానుంది. 2018 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లించకుండా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. 2019 జనవరి నుంచి మరో డీఏను కూడా చంద్రబాబు సర్కారు బకాయి పెట్టింది. ఈ రెండు బకాయిలను చెల్లించడంతో పాటు 2019 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏను కూడా చెల్లించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019 జూలై నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.2,011 కోట్లను భరించనుంది. 30 నెలల బకాయిలకు రూ.5,028.90 కోట్లు వ్యయం కానుంది.


పెన్షనర్లకు…. ఉద్యోగుల‌కు…

పెన్షనర్లకు 3.144 శాతం పెంపు జూలై 2018 నుంచి వర్తించ‌నుంది. జనవరి 2021 వ‌ర‌కు చెల్లించ‌నున్నారు. అలాగే.. 2019 జనవరి నుంచి మరో 3.144 శాతం డీఏ పెంపు వర్తింపు, 2021 జూలై నుంచి చెల్లింపు. 2019 జూలై నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు, జనవరి 2022 నుంచి చెల్లింపు. ఉద్యోగుల‌కైతే జూలై 2018 నుంచి 3.144 శాతం డీఏ పెంపు, 2021 జనవరి వ‌ర‌కూ చెల్లించ‌నున్నారు. 2019 జనవరి నుంచి 3.144 శాతం పెంచిన డీఏ జూలై 2021 నుంచి చెల్లింపు. 2019 జూలై నుంచి పెంచిన 5.24 శాతం డీఏ జనవరి 2022 వ‌ర‌కూ చెల్లించ‌నున్నారు. దీని వ‌ల్ల ప్ర‌భుత్వంపై భారం ప‌డినా ఉద్యోగుల‌కు, పెన్స‌న‌ర్ల‌కు బ‌కాయిలు ఉండ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌తో జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.