Idream media
Idream media
తాను ప్రాధాన్యత ఇచ్చే రంగాల్లో విద్య కచ్చితంగా ఒకటని, కేవలం చదువుకున్న పిల్లల ద్వారానే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటినుంచి చెప్తూ వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు కూడా జగన్ విద్యావ్యవస్థపై ఎక్కువ స్పందించేవారు. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తానన్నారు. అలాగే చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ జగన్ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేపట్టారు.
అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతోపాటుగా నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాపౌట్లను తగ్గించేందుకు అమ్మఒడి పథకంతో బడులకు వెళ్లే పిల్లల తల్లుల అకౌంట్లలో ఏడాదికి రూ.15000 వేయడం కూడా ప్రారంభించేసారు. అంతేకాదు.. విద్య ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాపారంగా మారకూడదంటూ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం చట్టాన్ని తీసుకొచ్చారు. విద్యాహక్కు చట్టాన్ని నూరుశాతం అమలు చేయడంతోపాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో పేద విద్యార్ధులకు 25శాతం సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్య అనేది సేవే కానీ డబ్బు సంపాదించే వ్యాపార రంగం కాదన్న జగన్ ప్రైవేట్ పాఠశాలల్లో కనీస ప్రమాణాలు, ఉపాధ్యాయులు ఉండాలని, లేదంటే కఠినచర్యలు తీసుకుంటామని గతంలోనే అసెంబ్లీ వేదికగా హెచ్చరించారు. ఇదే సమయంలో ఇష్టారాజ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు వసూలు చేస్తుండడం.. వాటిని చెల్లించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనిస్తోంది.
ఈ క్రమంలో సీఎం ఆలోచనలకు అనుగుణంగానే అధికారుల యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 130 పాఠశాలల్లో అధికారులు తనిఖీలు చేసారు. నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న పలు స్కూళ్లపై చర్యలు తీసుకున్నారు. పలురకాల తోక పేర్లతో ఆకర్షించి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఏడాదికి రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారు.. టెక్నో, ఈ-టెక్నో, ఒలంపియాడ్, ఐఐఐటీ, జేఈఈ, మెరిట్, నికేతన్, డిజిటల్ లాంటి పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. తాజాగా జరిగిన తనిఖీల్లో పాఠశాలల్లో వసూలు చేసే ఫీజుల వివరాలు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, టీచర్ల అర్హతలు, పాఠశాల, టాయిలెట్ల భవనాలను పరిశీలించారు. ఏ లోపాలున్నా వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకున్నారు.
గుంటూరు జిల్లా అరండల్‌పేట లోని శ్రీ చైతన్య సీబీఎస్‌ఈ స్కూల్లో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. విజయనగరం జిల్లావ్యాప్తంగా 24పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. తిరుపతి, ప్రకాశం, ఒంగోలు, టంగుటూరు, దర్శి, చీరాలలోని ప్రైవేట్ పాఠశాలలోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పాఠశాల విద్యా కమిషన్ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్రంలోని మొత్తం 130పాఠశాలలలో తనిఖీలు చేపట్టామని, నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొదటి సారి నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని, పదే పదే చేస్తే నిర్మొహమాటంగా లైసెన్స్ రద్దుచేస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నిబంధనలను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లోని వెట్టి చాకిరీని సహించేది లేదన్నారు. అయితే ఈ తనిఖీల విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన నేపథ్యంలో హఠాత్తుగా ప్రైవేటు స్కూళ్లల్లో తనిఖీలు జరగడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.