iDreamPost
android-app
ios-app

RBK, Bank Services – రైతు ముంగిటకే బ్యాంకు సేవలు

  • Published Dec 25, 2021 | 5:59 AM Updated Updated Dec 25, 2021 | 5:59 AM
RBK, Bank Services – రైతు ముంగిటకే బ్యాంకు సేవలు

వ‍్యవసాయ పనులతో తలమునకలయ్యే రైతులు బ్యాంకుల సేవలు పొందడంలో ఇబ‍్బందులు పడుతున్నారు. ఇలాంటి కష్టాలకు తెరదించేలా రాష్ట్ర ప్రభుత‍్వం చొరవ తీసుకుంది. గ్రామాల్లో రైతులతోపాటు అన్నివర్గాలకూ బ్యాంకు పనుల్లో చేదోడు వాదోడుగా నిలిచేందుకు బిజినెస్‌ కరస్పాండెంట‍్ల ద్వారా మరింత మెరుగైన సేవలందించేలా నిర‍్ణయం తీసుకుంది.రోజూ వారే గ్రామంలో ఉండి బ్యాంకు సేవలు అవసరమయ్యేవారికి సహకరించేలా చూడాలని ఆదేశించింది. ఈ నిర‍్ణయం వల‍్ల అన‍్నదాతకు బ్యాంకు సేవలు చేరువ కానున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ‍్యవస‍్థ ద్వారా చాలా ఇబ‍్బందులు తొలగిపోయాయి. మండల లేదా జిల్లా కేంద్రాలకు వెళ్లి కార్యాలయాల చుట్టూ తిరిగే అగచాట్లు తప్పిపోయాయి. సచివాలయాల పరిధిలోనే రైతులకు వివిధ రూపాల్లో సేవలందించేందుకు రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది.

ఇవి విత‍్తనాల నుంచి పంట కొనుగోలు వరకూ కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇప్పుడు ఆర్బీకేలోనే బ్యాంకులకు సంబంధించి సేవలందించేందుకు బిజినెస్‌ కరస్పాండెంట్లను ఉండేలా నిర‍్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఖరీప్‌ సీజన్‌ నుంచి ఈ సేవలకు శ్రీకారం చుట్టినా వీరిని కలవాలంటే సరైన వేదిక ఉండేది కాదు. ఈ సమస‍్యను గుర్తించిన ప్రభుత‍్వం విషయాన్ని రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల సమితి (ఆర్‌బీఎల్‌సీ)కి సూచించింది.

దీంతో సమితి ఆదేశాల మేరకూ ఈ రబీ నుంచి అన్ని గ్రామాల్లోని ఆర్బీకేలలో ఈ బిజినెస్‌ కరస్పాండెంట్లు నిత‍్యం అందుబాటులో ఉంటారు. రైతు భరోసా కేంద్రాలకే బ్యాంకింగ్‌ సేవలను అనుసంధానం చేశారు. గతంలో  బిజినెస్‌ కరస్పాండెంట్లు బ్యాంకులు లేని గ్రామాలకు వెళ్లి ఖాతాదారులకు సేవలు అందించినా పూర్తి స్థాయిలో అందేవి కావు. వారు ఎప్పుడు వస్తారో తెలిసేది కాదు. వచ్చినా ఆయా గ్రామాల్లో రచ్చబండ లేదా జనం తాకిడి ఎక్కువ ఉన్న ప్రాంతాల నుంచి కార్యకలాపాలు నిర్వహించేవారు. ఆర్‌ఎల్‌బీసీ ఆదేశాల మేరకు ఇక నుంచి వీరు రైతుభరోసా కేంద్రాల్లో రోజూ కనీసం రెండు గంటల పాటు సేవలందించనున్నారు.

Also Read : ప్రతిపాదిత కార్యనిర్వాహక రాజధానిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు

రూ.20వేల వరకూ లావాదేవీలు..

రైతులు, ఇతరుల ఇబ‍్బందులను దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటల నుంచి ..లేదా మధ్యాహ‍్నం 3 గంటల నుంచి బిజినెస్‌ కరస్పాండెంట్లు ఇకపై రైెెతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. రోజూ రెండు గంటలపాటు ఎలాంటి బ్యాంకు లావాదేవీలలోనైనా సహకరిస్తారు. ఆర్బీకేల్లో వీరి సేవల సమయాన్ని తెలిపేలా బోర్డు ఏర్పాటు చేస్తారు. బ్యాంక్‌ ఖాతా ప్రారంభం నుంచి చెక్కుబుక్‌ జారీ, డిపాజిట్లు, నగదు చెల్లింపు వంటి కార్యకలాపాలలో చేయూతనందిస్తారు.

ఖాతాదారులు రోజుకు రూ.20వేల వరకూ లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యం ఉంది. అంతకన్న ఎక్కువ ఉంటే సమీప బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 15 వేలకు పైగా గ్రామాల్లో 10,778 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వీటి కేంద్రంగా బ్యాంకుల బిజినెస్‌ కరస్పాండెంట్లు అందించే సేవలను బట్టి వారికి కమీషన్‌ ఉంటుంది. ఈ రబీలో పంట రుణాలు తీసుకునే రైతులకు బిజినెస్‌ కరస్పాండెంట‍్ల వల‍్ల ప్రయోజనం చేకూరుతుంది. అవసరమైన కాగితాలు ఆర్బీకేలోని ఈ ఉద్యోగికి అందజేస్తే సరిపోతుంది. రుణం కోసం దూరాన ఉన‍్న బ్యాంకుకు వెళ్లే ఇబ‍్బంది తొలగుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్ని వ్యక్తిగత ఖాతాల ద్వారా లావాదేవీలు జరుగుతున్న నేపథ‍్యంలో బ్యాంకులకు వెళ్లి సమయం వృథా చేసుకోకుండా గ్రామ స్ధాయిలో బ్యాంకు సేవలు పొందవచ్చు. ముఖ్యంగా రైతులకు ఆర్‌బీకే బ్యాంకింగ్‌ సేవ బాగా ఉపయోగపడుతుంది. 

Also Read : పులివెందులలో ప్రతిష్టాత్మక కంపెనీ.. శంకుస్థాపన చేసిన సీఎం