iDreamPost
android-app
ios-app

ఠాగూర్ కాంబినేషన్లో మెగా మూవీ – పుకార్లు నిజాలు

  • Published Jan 21, 2023 | 8:22 PM Updated Updated Jan 21, 2023 | 8:22 PM
ఠాగూర్ కాంబినేషన్లో మెగా మూవీ – పుకార్లు నిజాలు

మాస్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్న వివి వినాయక్ గత కొంత కాలంగా పెద్ద యాక్టివ్ గా లేరు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ బాధ్యత తీసుకున్నాక దాని షూటింగ్ అయితే చేశారు కానీ అదసలు ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ తెలియనంత అయోమయం నెలకొంది. దీని సంగతలా ఉంచితే త్వరలో చిరంజీవితో ఓ సినిమా ఓకే కావొచ్చనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆ మధ్య వచ్చిన అజిత్ విశ్వాసంని తెలుగు రీమేక్ చేసే ఆలోచనతో తనను పిలిపించినట్టు సోషల్ మీడియాలో గట్టి ప్రచారమే జరిగింది. కానీ అదంతా వట్టి పుకారేనని అసలా ఆలోచనే లేదట.

ఒక మంచి స్ట్రెయిట్ సబ్జెక్టుతో వస్తే తప్పకుండ అవకాశం ఇస్తానని చిరు అన్నారట. దీంతో వినాయక్ ఆ పనిలో ఉన్నట్టు తెలిసింది. ఈ కాంబోలో గతంలో రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. మొదటిది ఠాగూర్. తమిళ హిట్ రమణను తెలుగు ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు చేసిన మార్పులు గొప్ప ఫలితాన్ని ఇచ్చాయి. రాజకీయాలను వదిలేసి కంబ్యాక్ ఇవ్వాలని చిరు ఎంచుకున్న కత్తి రిమేక్ ఖైదీ నెంబర్ 150ని హ్యాండిల్ చేసింది కూడా వినాయకే. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో ఇంటెలిజెంట్ తీశాడు అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఏ హీరోతోనూ టైఅప్ అవ్వలేదు. గాడ్ ఫాదర్ చర్చల టైంలో, వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ నిర్ణయంలో వినాయక్ పాత్ర ఉందట.

ఇవన్నీ పక్కనపెడితే వినాయక్ కు మెగాస్టార్ నిజంగా ఛాన్స్ ఇస్తారనేది వేచి చూడాలి. భోళా శంకర్ రూపంలో పదేళ్లకు పైగా దర్శకత్వం చేయని మెహెర్ రమేష్ కే ఎస్ చెప్పినప్పుడు ఇంకెవరికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వాల్తేరు వీరయ్య సక్సెస్ తో మంచి ఊపు మీదున్న చిరంజీవిని ఒప్పించడం అంత ఈజీ కాదు కానీ అసాధ్యమూ కాదు. ఇప్పుడున్నవి కాకుండా చిరంజీవి కొత్తగా ఒప్పుకున్నవి ఏమీ లేవు. డివివి దానయ్య నిర్మాతగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఓ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు కానీ తర్వాత ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా పోయింది. మరి వినాయక్ ఫ్రెష్ సబ్జెక్టుతో ఏమైనా కన్విన్స్ చేస్తాడేమో చూడాలి. విశ్వాసం కాదనే విషయం తెలిశాక ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు