iDreamPost
iDreamPost
మాములు పరిస్థితుల్లో వచ్చేదాని కన్నా పాగల్ చాలా మంచి ఓపెనింగ్స్ సాధించింది. లాక్ డౌన్ తర్వాత కాస్త చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ తో పెద్ద బ్యానర్ లో వచ్చిన సినిమా ఇదే కావడంతో యూత్ బాగానే థియేటర్లకు పోటెత్తారు. కానీ వచ్చిన టాక్, మీడియాలో వెల్లువెత్తిన రివ్యూలు పాగల్ కు ఏ మాత్రం పాజిటివ్ గా లేకపోవడం రేపటి నుంచి ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ అతిశయోక్తితో అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలింగ్ కి టార్గెట్ గా మారాయి. హీరో పేరు ఎప్పుడు మార్చుకోబోతున్నాడంటూ నెటిజెన్లు మాములు కామెడీ చేయడం లేదు. ఇదంతా సెల్ఫ్ గోల్ లాంటిదే.
ఆ రోజు దర్శకుడు సైతం రాసి పెట్టుకోండి బ్లాక్ బస్టర్ ఇస్తున్నా అని చెప్పడం అది కూడా హై లైట్ అవ్వడం మర్చిపోకూడదు. విడుదలకు ముందు టీమ్ లో ఎవరికైనా ఆత్మవిశ్వాసం ఉండటం మంచిదే కానీ అది మరీ ఓవర్ ది బోర్డు వెళ్ళినప్పుడే ఇలాంటి వ్యంగ్యాస్త్రాలకు బలి కావాల్సి వస్తుంది. గతంలో వినయ విధేయ రామ గురించి బోయపాటి శీను, శక్తి గురించి మెహర్ రమేష్, బ్రహ్మోత్సవం గురించి ఆర్టిస్ట్ నరేష్ ఇలా వీళ్ళు మాట్లాడిన తీరు ఇప్పటికీ వీడియోలు మీమ్స్ రూపంలో జనం హాస్యం కోసం వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ విశ్వక్ దొరికేసరికి ఫేస్ బుక్, ట్విట్టర్,ఇన్స్ టా వేదికగా జరుగుతున్న రచ్చ చిన్నది కాదు.
పాగల్ కమర్షియల్ గా గట్టెక్కుతుందా లేదా అనేది తర్వాత తేలే విషయం. కానీ ఏ సినిమా విషయంలో అయినా మరీ ఎక్కువ కాన్ఫిడెన్స్ మాటల రూపంలో బయట పెట్టుకుంటే దాని ఫలితం ఇదిగో ఇలాగే ఉంటుంది. అంచనాలు పెరిగిపోయి మూసుకున్న థియేటర్లను కూడా హీరో తెరిపిస్తాడనే మాటలు విని ప్రేక్షకులు ఎక్కువ ఆశిస్తే నిరాశ తప్పదు. పాగల్ కంటెంట్ కూడా ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్రేమ పేరుతో చేసిన సాగతీత బాగా డ్యామేజ్ చేసింది. మౌత్ టాక్ కూడా దీన్నే ప్రధానంగా మైనస్ గా చెబుతోంది. ఇప్పుడైతే బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి పాగల్ ఫైనల్ గా ఏ ఫిగర్స్ తో వస్తాడో చూడాలి
Also Read : ఫలిస్తున్న పుష్ప మార్కెటింగ్ స్కెచ్