మధ్య ప్రదేశ్ రాజకీయాలు తుది అంకానికి చేరుకున్నట్లే కనిపిస్తున్నాయి. సోమవారం నాడు అసెంబ్లీలో బలపరీక్ష జరపాలని,గవర్నర్ లాల్జీ టాండన్ స్పీకర్ ప్రజాపతిని ఆదేశించారు. కాగా ప్రజాపతి ఈరోజు బలపరీక్ష నిర్వహిస్తారా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
నేటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ షెడ్యూల్ లో బలపరీక్ష అంశం మాత్రం లేదు. దీంతో నేడు బలపరీక్ష జరిగే అవకాశం లేదన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో నడుస్తున్నాయి.స్పీకర్ ప్రజాపతి గవర్నర్ ఆదేశాలను పాటిస్తాడా లేక పెడచెవిన పెడతారా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది.
కాగా బీజేపీ ఎమ్మెల్యేలతో శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు సమావేశం నిర్వహించనున్నారు. జ్యోతిరాదిత్య సింథియా ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటుతో కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదంలో పడింది. స్పీకర్ ఆదేశిస్తే తమబలాన్ని అసెంబ్లీలో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని కమల్ నాథ్ అన్నారు. కానీ ఈరోజు బలపరీక్ష నిర్వహించే సూచనలేవి కనబడకపోవడంతో రేపు బలపరీక్ష జరగొచ్చు అన్న చర్చలు నడుస్తున్నాయి.
గతంలో కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కునే సమయంలో నాటి కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ అసెంబ్లీలో పరిస్థితులు చక్కబడిన తర్వాత బలపరీక్ష నిర్వహించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షలో నిలబడలేదు. నేడు మధ్యప్రదేశ్ లో బలపరీక్ష నిర్వహించే అంశం కూడా ప్రజాపతి విచక్షణాధికారంపై ఆధారపడటంతో తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి స్పీకర్ ప్రజాపతి ఎలా వ్యవహరించబోతున్నారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
బలపరీక్షలో విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని కమల్ నాథ్ కనబరుస్తున్నా బీజేపీ వ్యూహాలను ఎదుర్కొని కమల్ నాథ్ ప్రభుత్వం నిలబడుతుందన్న నమ్మకం మాత్రం ఏ ఒక్కరిలోనూ లేదన్నది సుస్పష్టం. రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మినహాయించి అసెంబ్లీలో బలాబలాలను పరిశీలిస్తే బీజేపీదే పైచేయిగా కనిపిస్తుంది. ఏది ఏమైనా బలపరీక్ష నిర్వహిస్తే కమల్ నాథ్ సర్కార్ నిలబడుతుందా లేదా కుప్పకూలుతుందా అనేది తెలుస్తుంది. బహుశా రేపటితో ఆ విషయం తేలుతుందేమో.