Dharani
Dharani
టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాగంగా.. రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏపీ ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకి 14 రోజులు రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. టీడీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుకుంటున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. లోకేష్‌ని పక్కకు పెట్టారా.. చంద్రబాబు జైలుకు పరిమితం అయితే లోకేష్ పరిస్థితి ఇంతేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలపై చర్చించడానికి బాలకృష్ణ.. టీడీపీ కీలక నేతలతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులపై రివ్యూలు నిర్వహిస్తున్నారు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, బాలకృష్ణలు ఇద్దరూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తదుపరి పరిణామాలపై రివ్యూలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. టీడీపీని కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారా.. లోకేష్‌కి ప్రస్తుత పరిస్థితిని హ్యాండిల్ చేసేంత సామర్థ్యం లేదనే అభిప్రాయం సొంత నేతల్లోనే ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. చంద్రబాబు తెర మీద లేకపోతే.. లోకేష్‌ని పట్టించుకునే నాథుడే లేడా అని చర్చించుకుంటున్నారు జనాలు.
తన వారసుడిగా లోకేష్‌ని తీసుకురావడం కోసం చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో.. ఎమ్మెల్సీ ద్వారా లోకేష్‌కి మంత్రి పదవి కట్టబెట్టారు. తర్వాత 2019 ఎన్నికల్లో లోకేష్ దారుణంగా ఓడిపోయాడు. దాంతో లోకేష్ సామర్థ్యం ఏంటో అందరికి అర్థం అయ్యిందనే చర్చ జోరుగా సాగింది. ఇటు చూస్తే చంద్రబాబుకి వయసు మీద పడుతుంది. త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి. ఇక తన వారసుడిగా లోకేష్‌ని తప్ప.. కనీసం ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన వారిని కూడా చంద్రబాబు అంగీకరించడు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నా.. లోకేష్‌కి పోటీ అవుతాడనే ఉద్దేశంతోనే చంద్రబాబు.. దాన్ని జరగనివ్వడం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తన తర్వాత వారుసుడిగా లోకేష్‌ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నాడు లోకేష్. ఇలాంటి తరుణంలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. పరిణామాలపై స్పందించడానికి, కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం తదుపరి కార్యచరణపై.. పార్టీ నేతలతో కూడా చర్చించలేదు. ప్రస్తుతం లోకేష్ నిర్వహించాల్సిన బాధ్యతలను బాలకృష్ణ, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వంటి వారు చూసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులపై వాళ్లే సమీక్షలు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ అయితే స్వయంగా నేను ముందుటా.. టీడీపీని నడిపిస్తాను అన్నాడు. దాంతో టీడీపీ పగ్గాలు బాలయ్యకే అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.