iDreamPost
iDreamPost
కావాలని ప్లాన్ చేసుకోవడమని కాదు కానీ కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల ఒకే కుటుంబంలోని హీరోలు చాలా తక్కువ గ్యాప్ లో పోటీ పడాల్సి వస్తుంది. ఇది బాక్సాఫీస్ వద్ద అప్పుడప్పుడు కనిపించే సీన్. తాజాగా సాయి తేజ్, వైష్ణవ తేజ్ ల క్లాష్ కూడా కేవలం ఏడు రోజుల నిడివిలో తప్పేలా లేదని ఫ్రెష్ న్యూస్. దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ కలెక్టర్ గా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్ రిలీజ్ డేట్ ని అక్టోబర్ 1కి లాక్ చేసి అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వైష్ణవ్ తేజ్-క్రిష్ కాంబోలో రూపొందిన ఇంకా టైటిల్ పెట్టని సినిమాను అక్టోబర్ 8న విడుదల చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఇది ఇంకా అధికారికం కాలేదు.
అంటే అన్నదమ్ములు ఇద్దరూ జస్ట్ వన్ వీక్ తేడాతో ప్రేక్షకులను పలకరిస్తారన్న మాట. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్-రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో క్రిష్ చాలా వేగంగా దీన్ని పూర్తి చేశారు. సుప్రసిద్ధ నవల కొండపోలం ఆధారంగా పూర్తిగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. గత ఏడాదే షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం వల్ల ఫస్ట్ కాపీ లేట్ అయ్యింది. లేదంటే లాక్ డౌన్ టైంలో ఓటిటికి వెళ్లే ఆలోచన కూడా చేశారు. ఇక రిపబ్లిక్ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. ప్రస్థానం తర్వాత ఆ స్థాయి మేజిక్ చేయలేకపోతున్న దేవా కట్టా దీంతో కం బ్యాక్ అవుతారన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.
అక్టోబర్ రేస్ నుంచి ఆర్ఆర్ఆర్ తప్పుకునే అవకాశాలు స్పష్టంగా పెరగడంతో ఇతర నిర్మాతలు అలెర్ట్ అయిపోతున్నారు. ముందుగానే డేట్ లాక్ చేసుకుంటే అప్పటికప్పుడు ఇబ్బందులు రావని వాళ్ళ ఆలోచన. ఆచార్య కూడా ఈ కారణంగానే ఇంకా ఏదీ తేల్చుకోలేకపోతోంది. అఖండ అదే నెల రెండు లేదా మూడో వారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రవితేజ ఖిలాడీ సైతం మంచి డేట్ కోసం వెతుకుతోంది. ఒక్క ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ ప్రకటన ఎన్నో సమీకరణాలను మార్చబోతోంది. సెప్టెంబర్ తో మొదలుపెడితే డిసెంబర్ దాకా ఏదో ఒక క్రేజీ మూవీ ప్రతి వారం విడుదలకు సిద్ధం కావడం ఖాయమే. అందులో అనుమానమే అక్కర్లేదు
Also Read : పరిష్కారం కోసం టాలీవుడ్ ముందడుగు