iDreamPost
android-app
ios-app

వైజాగ్ స్టీల్.. టాటా చేతికి వెళ్ల‌నుందా?

వైజాగ్ స్టీల్.. టాటా చేతికి వెళ్ల‌నుందా?

వైజాగ్ స్టీల్ ప‌రిర‌క్ష‌ణ‌కు ఓ వైపు కార్మికులు ఉద్య‌మిస్తుండ‌గా.. మ‌రోవైపు కేంద్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది. ఇటీవ‌ల ఢిల్లీలో కూడా విశాఖ ఉక్కు – ఆంధ్రుల హ‌క్కు నినాదాన్ని కార్మికులు, పార్టీల నాయ‌కులు వినిపించారు. పార్ల‌మెంట్ లో ఏపీ ఎంపీలు గట్టిగానే గ‌ళ‌మెత్తారు.

ఇదిలాఉండ‌గానే.. విశాఖ స్టీల్ కంపెనీలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ అంశం కీలక మలుపు తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆర్‌ఐ‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలోని విశాఖ స్టీల్స్‌ని కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్స్ ఆసక్తి చూపుతోంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ. నరేంద్రన్ జాతీయ మీడియాతో నిర్దారించారు. టాటా స్టీల్ ప్ర‌క‌ట‌న‌తో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఇప్పుడు మ‌రింత వేడెక్కనుంది. ఎందుకంటే.. స్టీల్ ప్లాంట్ ఆంధ్రులు త‌మ హ‌క్కుగా చాటి సాధించుకున్నారు.

ఈ క్ర‌మంలో స్టీల్ ప్లాంట్ ప్ర‌స్థానంలోని కొన్ని కీల‌క అంశాల‌ను ప‌రిశీలిస్తే.. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1965న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తీర్మానాన్ని సీఎం బ్రహ్మానందరెడ్డి స్వయంగా ప్రవేశపెట్టారు. ‘‘ఐదో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసే ప్రాంతం గురించిన ప్రకటనలో జాప్యం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనను అత్యవసరంగా గుర్తించాలి’’ అని అందులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. నాలుగో పంచవర్ష ప్రణాళికలో భాగంగా.. ఐదో ఉక్కు కర్మాగారం నెలకొల్పటం సాధ్యం కాదని ఇందిరాగాంధీ సెప్టెంబరులో పేర్కొన్నారు.

ఇందుకు కారణం.. దేశ ఆర్థిక పరిస్థితి ఒడిదొడుకుల్లో ఉండటం, నిధుల కొరత ఒకటైతే.. రాజకీయ అంశాలు మరొకటని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో ఒక స్టీల్ ప్లాంట్ కోసం పలు రాష్ట్రాలు పట్టుబడుతున్నపుడు ఒకచోట ఏర్పాటు చేస్తున్నట్లు నిర్దిష్టంగా ప్రకటిస్తే.. మిగతా చోట్ల అసంతృప్తి తలెత్తుతుందన్నది కాంగ్రెస్ నాయకత్వం ఆలోచనగానూ కొందరు చెబుతారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఉక్కు కర్మాగారాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి అయితే.. సేలంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చిందని కూడా అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది. ఉక్కు కర్మాగారాన్ని తమిళనాడుకో, కర్ణాటకకో తరలిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోసారి అన్యాయానికి గురవుతున్నామన్న ఆవేదన తలెత్తింది.

1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉద్యమం బలపడింది. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రజలు ఉద్యమించారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు 1966 అక్టోబరు 15న విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజులకే కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చి ముందు వరుసలో నిలుచున్నారు. వారికి రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. 1966 నవంబర్ 1వ తేదీన విశాఖపట్నంలో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమవటంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. తొమ్మిదేళ్ల బాలుడు కె.బాబూరావు సహా తొమ్మిది మంది చనిపోయారు. వారిలో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు.

దీంతో ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చింది. విజయవాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఏలూరు కాలువలో పడేశారు. ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల్లో.. తగరపువలసలో ఒకరు, అదిలాబాద్‌లో ఒకరు, విజయవాడలో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు, కాకినాడలో ఒకరు, వరంగల్‌లో ఒకరు, సీలేరులో ఒకరు, గుంటూరులో ఐదుగురు చనిపోయారు. మొత్తం మీద విశాఖతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం అంశంపై పరిశీలనకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గదని ప్రధాని ఇందిరాగాంధీ తనను కలిసేందుకు వచ్చిన రాష్ట్ర ఎంపీల బృందానికి తేల్చిచెప్పారు.

1966 నవంబర్ 3న దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన నాటి సీఎం బ్రహ్మానందరెడ్డి.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు విషయం తెలిపి.. రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సరేనందని చెప్పి.. అమృతరావుకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపజేశారు. దీంతో ఉద్యమం సద్దుమణిగింది.

ఉద్యమం తర్వాత మూడేళ్లకు 1970 ఏప్రిల్ 17న.. విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు. ప్లాంటు కోసం కురుపాం జమీందారులు 6,000 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది 1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకుస్థాపన చేశారు. 1990లో ఉక్కు ఉత్పత్తి ఆరంభమైంది. మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది.

ప్రస్తుతం ఈ ప్లాంటు 26,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్‌ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. కానీ.. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతంగా ఇనుప ఖనిజం గనులు లేకపోవటం వంటి కార‌ణాలుగా త‌ర‌చూ ఇబ్బందులు ఎదుర్కొంది. విశాఖ ఉక్కు కర్మాగారం లోని 100 శాతం కేంద్ర ప్రభుత్వ వాటాలను అమ్మాలని గత జనవరి 27 వ తేదీన ఆర్ధిక వ్యవహరాల పై ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఉక్కు కార్మికులు పరిరక్షణ పోరాట సమితి పేరుతో పెద్ద ఎత్తున పోరాటలు చేసింది. ఏకంగా ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ లో సైతం నిరసన దీక్షలు చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పలు దఫాలు ప్రధానికి లేఖలు కూడా రాశారు.

పెట్టుబడుల ఉపసంహరణ బదులు ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ అనేక సూచనలు చేశారు. రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ లో గొడవ చేశారు. కొందరు ఏకంగా కోర్టులను ఆశ్రయించారు. అయినా ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. సరికదా అమ్మి తీరుతాం లేదంటే మూసివేస్తాం అంటూ అటు పార్లమెంట్ తో పాటు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. మరోవైపు అమ్మకపు ప్రక్రియను నిరాఘాటంగా కొనసాగిస్తూ వచ్చారు. అమ్మకానికి కీలకమైన న్యాయ సలహాదారు ఎంపిక కోసం పిలిచిన టెండర్లను ఈ నెల 26 న ఖరారు చేయనున్నారు. ఇందుకోసం దేశం లోని ప్రముఖ న్యాయ సలహా సంస్థలు కూడా బిడ్ దాఖలు చేస్తున్నట్టు సమాచారం. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుపై ఇప్పటికే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థాయి లో కసరత్తు చేశామని, కొనుగోలు ప్రక్రియలో మేము పాల్గొంటున్నాం అని టాటా స్టీల్ స్పష్టం చేసింది.