iDreamPost
iDreamPost
ప్రశాంత్ కిషోర్.. గడిచిన ఎనిమిదేళ్లుగా ఆయన పేరు దేశ రాజకీయాల్లో మారుమ్రోగుతోంది. ఒక్క పార్టీ అనే కాకుండా దాదాపు అన్ని ప్రధాన పార్టీలతోనూ ఆయన కలిసి పనిచేశారు. మోడీ నుంచి మొదలుకుని మొన్నటి మమతా బెనర్జీ వరకూ పీకే పట్టిందల్లా బంగారమన్నట్టుగా ఆయన పనిచేసిన వారంతా గెలిచారు. అందులో యూపీలో కాంగ్రెస్ ఓటమి మాత్రం మినహాయింపు. దానికి కారణం కూడా పీకే చెప్పిన మాట ప్రకారం అయితే కాంగ్రెస్ నేతలు ఆయన చెప్పింది చేయలేదన్నదే ప్రధానమైనది.
ఇక తమిళనాడు నుంచి పంజాబ్ వరకూ ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు ఫలించాయి. ఏపీలో జగన్ నుంచి బీహార్ లో నితీష్ కుమార్ వరకూ పీకే వ్యూహాలు ఫలించి పట్టాభిషిక్తులయ్యారు. అంతటితో సరిపెట్టకుండా ప్రశాంత్ కేవలం స్ట్రాటజిస్ట్ గానే కాకుండా నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా దిగారు. తన సొంత రాష్ట్రం బీహార్ నుంచి జేడీయూ ఉపాధ్యక్షుడిగా కూడా ఎంపికయ్యారు. కానీ కొంతకాలానికే నితీష్ తీరుతో ఆయనకు దూరమయ్యారు ఆ వెంటనే సొంతంగా ఓ వేదిక ఏర్పాటు చేసుకుని కొన్ని చర్చా వేదికలు, యువతను కదిలించే ప్రయత్నాలు కూడా చేసినా వాటిని మధ్యలోనే విరమించుకున్నారు.
ఇక తాజాగా బెంగాల్ ఎన్నికలకు ముందు అక్కడ బీజేపీకి డబుల్ డిజిట్ దాటదంటూ ఆయన ఢంకాభజాయించారు. బీజేపీకి వందలోపు సీట్లు మాత్రమే వస్తాయని ఆయన చెప్పినట్టుగానే చివరకు 77 స్థానాలకే కమలం పరిమితం అయ్యింది. అదే సమయంలో బీజేపీకి వంద దాటి వస్తే తాను వ్యూహకర్త వృత్తికి ఫుల్ స్టాప్ పెట్టేస్తానని శపథం చేసిన పీకే, వంద దాటి రాకపోయినా తానికపై స్ట్రాటజిస్ట్ గా కొనసాగడం లేదంటూ ప్రకటించారు. దాంతో ఆయన ఫ్యూచర్ చుట్టూ ఆసక్తికర చర్చ సాగింది. ఆయన మాత్రం ఇప్పటి వరకూ ఎటూ తేల్చలేదు.
చివరకు రెండు నెలలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే పలువురు నేతల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. తొలుత శరద్ పవర్ తో పలుమార్లు భేటీ అయ్యారు. ఆ తర్వాత పవార్ సారధ్యంలో బీజేపీ, కాంగ్రేసేతర పార్టీలు కొన్ని సమావేశమయ్యాయి. తాజాగా పీకే దృష్టి కాంగ్రెస్ వైపు మళ్లింది. ఆపార్టీ నేతలను సోనియా నుంచి రాహుల్, ప్రియాంక వరకూ పదే పదే కలుస్తున్నారు. తొలుత పంజాబ్ లో సీఎం కెప్టెన్ అమరీందర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య సఖ్యత కుదిర్చే పని చేస్తున్నారా అనే అనుమానం కలిగింది. కానీ తాజాగా పీకే నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలున్నాయని ప్రచారం మొదలయ్యింది.
గడిచిన రెండేళ్లుగా మోడీకి వ్యతిరేకంగా పలు చోట్ల పీకే పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరు మీద విమర్శలు కూడా గుప్పించారు. ఈ నేపథ్యంలో దేశఃలో ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఆయన ప్రయత్నం చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. పైగా కాంగ్రెస్ కి దూరమయిన నేతలందరితో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. శరద్ పవర్, మమతా బెనర్జీ, జగన్ అందరూ ఒకనాటి కాంగ్రెస్ నేతలే. ప్రస్తుతం సొంత పార్టీలు పెట్టుకున్నారు. జగన్, మమతా ముఖ్యమత్రులుగా ఉన్న పీకే మిత్రులు. ఇక కేసీఆర్ వంటి వారితోనూ పీకే కి మంచి స్నేహమే ఉంది స్టాలిన్ తో కలిసి ఇటీవల ఎన్నికల్లో పనిచేశారు. దాంతో రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెసేతర ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో పీకేకి దగ్గరి సంబంధాలున్నాయి. దాంతో వారిని కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తారా లేక తానే కాంగ్రెస్ నేతగా రూపాంతరం చెంది వారిని కలుపుకుని పోతారా అన్నదే చర్చనీయాంశం. అయితే పీకే ప్రయత్నాలకు బీజేపీ నుంచి ఎలాంటి చెక్ వ్యూహం సిద్ధమవుతుందన్నది కూడా చూడాలి. ఏమయినా పీకే వ్యూహకర్తగా కొనసాగబోనని చెప్పిన తరుణంలో కార్యకర్తగా మారితే ఎలా ఉంటుందో చూడాలి.