iDreamPost
android-app
ios-app

ముద్రగడ పార్టీ పెడితే.. శెట్టి బలిజలు కలిసి వస్తారా..?

  • Published Jan 04, 2022 | 9:16 AM Updated Updated Mar 11, 2022 | 10:27 PM
ముద్రగడ పార్టీ పెడితే.. శెట్టి బలిజలు కలిసి వస్తారా..?

కాపు ఉద్యమనేతగా ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ప్రజలందరికీ చిరపరిచితులు. కానీ ఆయన మూడు దశాబ్దాల క్రితమే రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారన్నది చాలామందికి తెలియని విషయం. ఎన్టీఆర్ సారథ్యంలోని మంత్రివర్గంలో ఆయన కీలక శాఖలు నిర్వహించారు. అదే సమయంలో టీడీపీలో ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు తీరుతో ముద్రగడ ఆపార్టీకి దూరమయ్యారు. చివరకు ఉమ్మడి రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు చెందిన నేతలంతా కలిసి ఓ పార్టీని కూడా పెట్టారు. తెలుగునాడు పేరుతో అప్పట్లో కే జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తి, ముద్రగడ పద్మనాభం కలిసి ఓపార్టీని స్థాపించారు. కానీ అది స్వల్పకాలమే మనుగడలో ఉంది. ఆ తర్వాత ఎవరిదారి వారు చూసుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ముద్రగడ పార్టీ పెడుతున్నారనే ప్రచారం జోరందుకుంటోంది. తాజాగా ఆయన రాసిన లేఖ కూడా దానికి తగ్గట్టుగానే ఉండడంతో ఊహాగానాలు విస్తృతమవుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ముద్రగడ రాఘవరావు వారసుడిగా పద్మనాభం రాజకీయ ప్రవేశం చేశారు. బరిలో దిగిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. జనతాపార్టీ తరఫున 1978 లో ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ పద్మనాభం 1982 లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ పంచన చేరారు, కేబినెట్‌లో మంత్రి అయ్యారు. రవాణా, సహకారం వంటి పలు శాఖలు నిర్వహించారు. చివరకు టీడీపీలో వర్గపోరు కారణంగా ఆయన పార్టీని వీడారు. అదే సమయంలో వంగవీటి రంగా హత్య తర్వాతి పరిణామాలతో ముద్రగడ టీడీపీ మీద తిరుగుబాటు చేశారు. కాపునాడు సారథిగా రంగ అనంతరం ముద్రగడ ఎదిగారు. కాపుల సమస్యలపై పలుమార్లు ఆందోళన చేశారు. 1994లో ఆయన చేసిన ఆమరణ దీక్ష సంచలనంగా మారింది.

ఇక 2015లో తునిలో జరిగిన కాపునాడు సభ, రత్నాచల్   ఎక్స్‌ప్రెస్ దగ్ధం కావడం వంటి పరిణామాలతో కాపు రిజర్వేషన్ల అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపింది. వరుసగా నాలుగు సార్లు ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ 1994 తర్వాత మళ్లీ అసెంబ్లీలో అడుగపెట్టలేదు. 1999లో కాకినాడ పార్లమెంట్ స్థానానికి టీడీపీ తరుపున రంగంలో దిగి విజయం సాధించారు. ఐదేళ్ల పాటు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన అనంతరం వైఎస్సార్ సారథ్యంలో కాంగ్రెస్ లో చేరి 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేశారు. కానీ అప్పట్లో ప్రజారాజ్యం అభ్యర్థి వంగా గీత చేతిలో కేవలం వెయ్యి ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక గడిచిన రెండు ఎన్నికల్లోనూ ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ముద్రగడ వారసులు రంగంలోకి వస్తారనే ప్రచారం సాగినా దానికి భిన్నంగా ముద్రగడ కుటుంబం రాజకీయ పదవులకు పోటీకి దిగలేదు. తొలుత వైఎస్ జగన్ కి జై కొట్టిన ముద్రగడ 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీని వీడారు. ఆ తర్వాత ఏపార్టీలోనూ ఆయన చేరలేదు.

Also Read : మళ్లీ జగనే సీఎం.. లేదంటే రాజకీయ సన్యాసం.. ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు..

కిర్లంపూడి కేంద్రంగా ఆయన ఆమరణదీక్షల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ముద్రగడ రగిలిపోయారు. టీడీపీ భూస్థాపితం కావాలని శాపనార్థాలు పెట్టారు. బాబు పతనం కళ్లారా చూడాలని కాంక్షించారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కి బుద్ధి చెప్పాలని కాపులకు పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి ముద్రగడ పద్మనాభం రాజకీయ తెరమీదకు వస్తున్నారనే ప్రచారం విస్తృతం కావడం చర్చనీయాంశం అవుతోంది. సుమారు దశాబ్దంన్నరగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా లేరు. కానీ నిత్యం లేఖలు రాస్తూ వార్తల్లో ఉంటున్నారు. ఉద్యమాలతో రాజకీయ వేడి రాజేశారు. కాపుల సమస్యలపై స్పందిస్తూ గుర్తింపు సాధించారు. 2014కి ముందు ముద్రగడ ను తమ పార్టీలో చేరాలని టీడీపీ పలుమార్లు విజ్ఞప్తి చేసింది.

పెద్దాపురం అసెంబ్లీ స్థానం ఆయనకే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. కాపులకు రిజర్వేషన్ల హామీతో పాటుగా ముద్రగడకు అసెంబ్లీ సీటు కూడా ఆఫర్ చేయడంతోనే ముద్రగడ సందిగ్ధంలో పడి వైఎస్సార్సీపీని వీడినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. కానీ చివరకు ముద్రగడకు పోటీ చేసే అవకాశం గానీ, కాపులకు రిజర్వేషన్లు కూడా అమలు చేసేందుకు చంద్రబాబు ముందుకు రాకపోవడంతో ముద్రగడ ఉద్యమం ఓ సందర్భంలో పతాకస్థాయికి చేరింది. ఆ తర్వాత ముద్రగడ కుటుంబసభ్యుల పట్ల కూడా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో తీవ్రంగా అలసిపోయిన ముద్రగడ తాను ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ బలహీనపడుతోంది. అదే సమయంలో జనసేన బలపడే అవకాశాలు కనిపించడం లేదు. రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధంగా లేరని తేలిపోయింది. దాంతో విపక్షాల బలహీనతకు తోడు జగన్ పథకాల మూలంగా ముఖ్యమంత్రి మరింత బలపడుతున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా జనం వైఎస్సార్సీపీ వైపే చూస్తున్నారు.. దాంతో ప్రతిపక్షం బలహీనంగా ఉన్న దశలో మరోసారి సొంత పార్టీ పెట్టి అధికారపార్టీని ఢీకొట్టే యోచనలో ముద్రగడ ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా కాపులతో పాటుగా గోదావరి జిల్లాల్లోని ఎస్సీ, శెట్టిబలిజ కులాలను కూడా కలుపుకుని పోవాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే శెట్టిబలిజ నేత కుడుపూడి సూర్యనారాయణ, మాల మహానాడు నాయకుడు ఆర్ఎస్ రత్నాకర్ వంటి వారితో ముద్రగడ మంతనాలు జరిపారు. కాపు-మాల- శెట్టి బలిజ కాంబినేషన్ గోదావరి జిల్లాల్లో ప్రభావితం చేస్తుందనే అంచనాకు వారంతా వచ్చినట్టు సమాచారం.

విశాఖ నుంచి గుంటూరు వరకూ ఈ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో సొంతంగా పార్టీ పెట్టి ముందుకు సాగాలనే లక్ష్యంతో ముద్రగడ ఉన్నట్టు కనిపిస్తోంది ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో విశేష అనుభవం ఉండడం, కాపుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన నాయకుడిగా పేరు ఉండడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. టీడీపీ కోలుకోలేని దశలో తామే ప్రతిపక్షం స్థాయికి చేరుకునేలా ప్రణాళికలు వేస్తున్నట్టు ముద్రగడ అనుచరులు చెబుతున్నారు. చంద్రబాబుని అధికారంలో ఉండకూడదని పంతం పూనిన ముద్రగడ ఇప్పుడు విపక్షంలో కూడా బాబుకి చోటు దక్కకూడదని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దాంతో ముద్రగడ సామాజిక సమీకరణాలతో కూడిన పార్టీ తెరమీదకు వస్తే అది టీడీపీ ఆశలపై నీళ్లు జల్లడం ఖాయం. ముఖ్యంగా జనసేన సహాయంతో కాపుల ఓట్లు కొల్లగొట్టాలనే బాబు ఆశలకు గండిపడుతుందని చెప్పవచ్చు.

Also Read : బ్లూపింట్‌ తయారు చేద్దాం.. అధికారం సాధిద్దాం.. ముద్రగడ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం