టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగలబోతుందా? మరో ఎంపీ తెలుగుదేశం పార్టీ నుంచి చేజారి పోతున్నారా అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. అయితే ఇది చంద్రబాబుకు షాక్ అనాలో చంద్రబాబు వ్యూహం అని అనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే, గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రధాన వాయిస్ లాగా ఎప్పటికప్పుడు ప్రెస్మీట్లు పెట్టి ఇతర పార్టీలను తూర్పారబట్టిన సీఎం రమేష్, ఎంపీ సుజనాచౌదరి లాంటి వాళ్ళు బిజెపిలో చేరి టీడీపీ బీ టీమ్ అని ఎలా పేరు తెచ్చుకున్నారో, ఇప్పుడు వారి జట్టులో మరో ఎంపీ చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కేశినేని నాని బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి రాజకీయాల వైపు వచ్చారు. ముందు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఆ తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో కూడా నెగ్గుకు వచ్చారు. ఇటీవల జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కుమార్తెను బరిలోకి దించి ఆమెను కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు.
అయితే కొద్ది రోజులుగా పార్టీలో ఇమడలేక ఇబ్బందులు పడుతున్న నాని ఇప్పుడు ఈ బీజేపీ జట్టులో చేరబోతున్నారని అంటున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతలతో అంతర్గత సమావేశాలు కూడా జరిపారని తెలుస్తోంది. దీనికి ఊతమిచ్చే విధంగా విజయవాడ కేశినేని భవన్ బయట గోడకు గతంలో ఉన్న చంద్రబాబు చిత్రపటాన్ని తొలగించి ఆ స్థానంలో రతన్ టాటా, కేశినేని నాని కలిసి ఉన్న ఫోటోను ఏర్పాటు చేశారు. అదీకాక పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలను ఇతర ముఖ్య నాయకుల ఫోటోలు కూడా తొలగించారు. ఆ ఫోటోల స్థానంలో టాటా ట్రస్ట్ అలాగే ఎంపీ నిధులతో కేశినేని నాని చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో కూడిన ఫోటోలు ఉంచినట్లు తెలుస్తోంది. నిజానికి కేశినేని చూపు బీజేపీ వైపు ఉందనే చర్చ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
కేశినేని కూడా కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే కాక రాజకీయాల నుంచి తప్పుకోవాలని.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, మంచి నేతను వెతుక్కోమని కూడా అధిష్టానానికి చెప్పినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.. తన కుమార్తె కూడా ఎన్నికలకు దూరమని చెప్పేయడంతో ఆయన రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. నిజానికి బోండా ఉమా, బుద్దా వెంకన్నలతో విభేదాల నేపథ్యంలో కేశినేని నాని ఆ నిర్ణయం తీసుకున్నట్లు భావించారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో వారు ఇద్దరూ కేశినేని నాని పై బహిరంగంగానే తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా వారి మీద చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా నిరసిస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పినట్లు సమాచారం. టీడీపీ కోసం ట్రావెల్స్ కూడా వదులుకున్న నాని ఇప్పుడు మాత్రం బిజినెస్లు చేసుకోవాలంటే బీజేపీ సేఫ్ అని భావిస్తున్నారో? లేక చంద్రబాబు ప్లాన్ లో భాగంగా బీజేపీ నేతలకు టచ్ లోకి వెళ్లారో అనేది ఆ పెరుమాళ్ళకే ఎరుక.