భారతదేశ నెలవారీ తలసరి ఆదాయం 2017-18లో 9,580 వద్ద ఉంది. కానీ మార్చి 2019 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం 10% పెరిగి నెలకు, 10,534 కు చేరుకుంది. 10% వృద్ధితో తలసరి ఆదాయం పెరిగిదంటే ప్రజలంతా ఆనందపడాల్సిన విషయమే. కానీ ఇప్పుడు దేశంలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారా అంటే తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి. ఈ తలసరి ఆదాయం జీడీపీ లెక్కలు పేపర్ పై బాగానే కనిపిస్తాయి. కానీ బయట పరిస్థితులు వేరేగా ఉంటాయి.
ప్రపంచ జనాభాలో సుమారు 28% మంది పేదరికంతో మన దేశం నుండే ఉన్నారు. తాజాగా విడుదల చేసిన “Human Development Index” ర్యాంకింగ్ ప్రకారం మన దేశ స్థానం 129. మొత్తం 189 దేశాలలో కేవలం 60 స్థానాల దిగువన 129 వ ర్యాంకులో మన దేశం ఉందంటేనే ఊహించుకోవచ్చు.. దేశం వెలిగిపోతుందో వెలవెలబోతుందోనని…
ఇప్పటికే దేశ జీడీపీ గత పదేళ్లలో లేనంత కనిష్టస్థాయికి అంటే 4.5 కి దిగువగా నమోదవుతుందని, దేశంలో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆర్ధిక నిపుణులు ఇప్పటికే పలు ప్రకటనలు చేసారు. అసలు జీడీపీని ఫార్ములా ప్రకారం చూస్తే, ఒక దేశంలో మొత్తం వినియోగం + పెట్టుబడులు + ప్రభుత్వ ఖర్చులు + ఎగుమతులు – దిగుమతులు = జీడీపీ అని చెప్పవచ్చు. ఈ జీడీపీ ని దేశంలో ఉన్న జనాభాతో భాగిస్తే వచ్చే సంఖ్యను తలసరి ఆదాయం అనగా దేశంలో ఉన్న వ్యక్తులు నెలవారీ సంపాదించే సంపాదనగా లెక్క కట్టుకోవచ్చు.
ఇప్పుడు తలసరి ఆదాయంలో ఉన్న లొసుగులను గమనిస్తే… దేశ ఆదాయం మొత్తాన్ని అంటే జీడీపీ లెక్కకట్టేటప్పుడు అందులోనే దేశంలో ఉన్న బడాబాబులు కోటీశ్వరులంతా లెక్కలోకి వస్తారు. దాదాపుగా వారి సంపాదనే 70% ఉండొచ్చని అంచనా.. వారి సంపాదన మొత్తం కూడా తలసరి ఆదాయ లెక్కల్లో భాగం అవుతుంది. దేశంలో ఎక్కువగా కొందరి వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతం అయి ఉంటుంది. అప్పుడు తలసరి ఆదాయం లెక్కించినప్పుడు కోటీశ్వరుల ఆదాయం కూడా తలసరి ఆదాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఉదాహరణకు ఒక దేశంలో 1000 మంది ఉన్నారనుకుంటే, అందులో ఒక పది మంది కోటీశ్వరులు ఉన్నారని అనుకుందాం. కోటీశ్వరులకు చెందిన కంపెనీల్లో ఒక 500 మంది పనిచేస్తున్నారని అనుకుంటే ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పడేవాళ్ళు, కూలి పనులకు వెళ్ళేవాళ్ళు ఒక 300 మంది ఉంటే, మిగిలిన 190 మంది మాత్రం అసలు ఏ ఆధారం లేని కటిక దారిద్య్రం అనుభవించే పేదవారిగా పరిగణలోకి తీసుకుంటే, ఆ దేశ ఆదాయాన్ని లెక్క కట్టేటప్పుడు ఆ దేశంలో మొత్తం వినియోగం + పెట్టుబడులు + ప్రభుత్వ ఖర్చులు + ఎగుమతులు – దిగుమతులును లెక్కగడితే ఆ దేశ జీడీపీ తెలుస్తుంది. ఆ జీడీపీని దేశంలో ఉన్న 1000 మందితో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. అప్పుడు దేశంలో కటిక దరిద్రం అనుభవించేవారికి కూడా సరాసరి తలసరి ఆదాయం ఉన్నట్లు ఆ లెక్కలు చూపిస్తాయి. ఈ తలసరి లెక్కల లొసుగులను పక్కన పెడితే నిజానికి ఆ దేశంలో సంపద కొందరి చేతుల్లో కేంద్రీకృతం అయి ఉంది. కానీ లెక్కల్లో మాత్రం అది అందరి సంపదగా కనిపిస్తుంది.
దేశ తలసరి ఆదాయ లెక్కలు చూసి మురిసిపోవడం వల్ల దేశంలో ఉన్న నిరుద్యోగం పేదరికం ఆకలి చావులు పోవు. దేశంలో ఉన్న పేదరిక స్థాయి మనుషులను ఎంతగా ప్రభావితం చేస్తుందో మహారాష్ట్ర మంత్రి కాంగ్రెస్ నేత “నితిన్ రౌత్” ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కి రాసిన లేఖను గమనిస్తే అర్ధం అవుతుంది. నెలసరి సమయంలో కూలి పనులకు వెళ్లకపోతే ఆ రోజు గడవదు అని మహారాష్ట్రలో దాదాపు 30 వేలమంది మహిళా కూలీలు తమ గర్భ సంచులు తొలగించుకున్నారని ఆ లేఖలో పేర్కొనడం దేశంలో ఉన్న పేదరిక పరిస్థితులకు అద్దం పడుతుంది. చెరకు తోటల్లో పని చేయడానికి నెలసరి సమయంలో అనుమతించడం లేదని ఒకవేళ ఆ రోజు పని మానేస్తే పస్తులుండాల్సిన పరిస్థితులు వస్తాయని చాలామంది మహిళా కూలీలు గర్భ సంచులు తొలగించుకోవడానికి మొగ్గు చూపుతున్నారని అర్ధం అవుతుంది. దీనివల్ల మహిళలకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయని తెలిసినా తమ ఆకలి తీర్చుకోవడానికి, కుటుంబ ఆకలి తీర్చడానికి కొందరు మహిళలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే ప్రపంచంలో ఉన్న గొప్ప శక్తివంతమైన దేశాల సరసన చేరిన భారత దేశంలో ఇంకా ఆకలి చావులు ఉన్నాయంటే అది ఖచ్చితంగా ప్రభుత్వాల వైఫల్యమే. దేశ జనాభాలో దాదాపు 20(194.4 మిలియన్ల ప్రజలు) కోట్లమంది, అంటే మన జనాభాలో 14.5% మంది పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద పోషకాహార లోపం ఉన్న జనాభాకు నిలయంగా ఉన్న భారతదేశాన్ని చూసి పాలకులు గర్విస్తున్నారేమో అని ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పునరుత్పత్తి వయసులో (15-49 సంవత్సరాలు)ఉన్న మహిళలలో 51.4% రక్తహీనతతో బాధపడుతున్నారు. దేశంలో రోజుకు 7000 వేలమంది ఆకలితో చనిపోతున్నారు. సంవత్సరానికి దాదాపుగా 25 లక్షలమంది ఆకలి చావుల జాబితాలో చేరుతున్నారు. ఈ ఆకలి చావుల జాబితాలను చూస్తే ఇండియా వెలిగిపోతుందో వెలవెలబోతుందో ఎవరికైనా అర్ధం అవుతుంది.
2019 లో 117 దేశాలలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్(GHI) విడుదల చేసిన జాబితాలో భారత్ పొరుగున ఉన్న నేపాల్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ దేశాల కన్నా దిగువగా 102 స్థానానికి పడిపోయింది, 2018 లో భారత్ 95 వ స్థానంలో ఉండేది. 2000 సంవత్సరంలో మన దేశ ర్యాంకు 83. దేశంలో నిరుద్యోగం, నిరక్షరాస్యత, పేదరికం రాజ్యమేలుతూ ఆకలి చావులు పెరుగుతుంటే భారతదేశం నిజంగా వెలిగిపోతుందా అన్న మీమాంశ ఆలోచించగలిగిన ప్రతి ఒక్కరిలో అనుమానాలను రేకెత్తిస్తుంది.
దేశంలో గత దశాబ్దంలో లేనివిధంగా అత్యంత కనిష్ట స్థాయికి జీడీపీ చేరబోతుందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ జీడీపీ తగ్గితే తలసరి ఆదాయం కూడా తగ్గుతుంది. జీడీపీ విలువను పేపర్లపై పెంచి చూపించడానికి గత విధానాన్ని మార్చి కొత్త విధానాన్ని తీసుకు వచ్చినా జీడీపీ విలువను పెంచడంలో సఫలీకృతం కాలేదంటే దేశంలో ఆర్ధిక స్థితి ఎంతగా కృంగిపోయిందో అంచనా వేయవచ్చు. ఒకసారి భారతదేశ స్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో పోలుస్తూ ముఖ్యమైన ర్యాంకులను పరిశీలిస్తే కొన్ని నిజాలు బట్టబయలవుతాయి.
ఆకలి సూచికలో 102/117వ స్థానం
మానవాభివృద్ది సూచికలో 129/189 వ స్థానం!
ప్రపంచ శాంతి సూచికలో 141/163వ స్థానం!
మహిళలకు అత్యంత ప్రమాదకర దేశాల్లో 1వ స్థానం!
మహిళలపై లైంగిక దాడుల్లో 2వ స్థానం!
పోర్న్ వీడియోలు చూడటంలో 3వ స్థానం!
పైన తెలిపిన భారతదేశ ర్యాంకులను పరిశీలిస్తే భారతదేశ పరిస్థితులు అర్ధం అవుతాయి. నిజానికి తలసరి ఆదాయం కానీ, జీడీపీలో అభివృద్ధి కానీ దేశ అభివృద్ధిని నిజాయితీగా చూపించలేవు. అవన్నీ కేవలం గణాంకాలుగా మాత్రమే అని అర్ధం చేసుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఉంది. ముఖ్యంగా పాలకులు దృష్టి పెట్టాల్సిన విషయం ప్రజల జీవన సౌకర్యాల అభివృద్ధి, ఆకలి చావులు, పేదరిక నిర్మూలన, నిరుద్యోగ భారతాన్ని కాస్త ఉపాధి కలిగించే భారతంగా మార్చాల్సిన అవసరం పాలకులకు ఉంది. ఇప్పటికే మహిళలపై లైంగిక దాడుల విషయంలో ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ట మసకబారింది.వాషింగ్టన్ పోస్ట్ కథనంలో భారతదేశం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా తెలిపింది. మహిళలపై దాడులు చేసే అత్యంత ప్రమాదకర దేశాల్లో మొదటి స్థానంలో భారత దేశం ఉండటం ఆందోళన చెందాల్సిన విషయం.
ప్రభుత్వాలు పాలకులు భారతదేశం అగ్రదేశమని ప్రగల్భాలు పలకకుండా నిరుద్యోగం,ఆకలి చావులు,నిరక్షరాస్యత, పేదరికం తగ్గించడానికి కృషి చేయాలి. ప్రపంచ వ్యాప్తంగా మసకబారిన మహిళల రక్షణ విషయంలో కఠిన విధానాలు అమలు చేయాలి. జీడీపీ పెంచడానికి ప్రజల ఉపాధి అవకాశాలు పెంచడానికి కృషి చేయాలి. ఆకలికడుపులతోనే నిద్ర పోతున్న దాదాపు 20 కోట్లమంది ఆకలిని తీర్చి ఆకలి చావులు లేకుండా చేసినప్పుడే దేశం నిజంగా వెలిగిపోతున్నట్లు లెక్క.. ఆ దిశగా పాలకులు ప్రణాళికలు సిద్ధం చేయాలి. శాంతియుత జీవనాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలి. మహిళల రక్షణకు భరోసా ఇవ్వాలి. ప్రపంచ దేశాల్లో భారత్ ని అగ్రగామిగా నిలపాలి. అప్పుడే కదా భారత్ నిజంగా వెలిగిపోయేది. అలా కాకుండా గణాంకాలు చూసి మురిసినంతకాలం భారత్ గణాంకాల పరంగా పేపర్లలో ఊహలలో వెలిగిపోతుందేమో తప్ప వాస్తవానికి వెలవెలబోతోంది..