iDreamPost
iDreamPost
నారా లోకేష్ తో రాష్ట్రవ్యాప్త యాత్ర చేయించాలన్నది టీడీపీ అధినేత అసలు వ్యూహం. కానీ ఇప్పుడు పరిస్థితి దానికి అనుకూలంగా లేదని భావిస్తున్నట్టు సమాచారం. ఏపీలో ప్రజలేకాకుండా, టీడీపీ శ్రేణులు సైతం లోకేష్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో లేరని బాబు భావిస్తున్నారు. దాంతో తానే మళ్లీ బరిలో దిగాలనే ప్రయత్నం ప్రారంభించారు. దానికి తగ్గట్టుగా ప్రజాయాత్ర పేరుతో త్వరలో ఓ యాత్ర చేసేందుకు సంసిద్ధమయ్యారు. అయితే పాదయాత్ర చేయాలా లేక మరో రూపంలో ప్రజల మధ్యకు వెళ్లాలా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెబుతున్నారు.
చంద్రబాబు నిర్ణయం టీడీపీతో పాటుగా ఆయన కుటుంబంలో కూడా కాకరేపే అవకాశం ఉంది. తాను నాయకుడిగా ఎదగాలనే తహతహలో ఉన్న లోకేష్ కి తాజా నిర్ణయం పట్ల అసంతృప్తి ఖాయమని భావిస్తున్నారు. తాను చేయాల్సిన యాత్రకు తండ్రి సిద్ధం కావడాన్ని లోకేష్ జీర్ణించుకుంటారా లేదా అన్నది చూడాలి. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ కి చేరువవుతున్నట్టు సంకేతాలు ఇచ్చిన తరుణంలో ఈ వ్యవహారాన్ని డీల్ చేయాలటే బాబు బరిలో ఉండాల్సిన అవసరముందని టీడీపీ నేతల అభిప్రాయం. దాంతో చినబాబుకి ఛాన్స్ లేనట్టే కనిపిస్తోంది.
Also Read : బద్వేల్ ఉప ఎన్నిక మీద పవన్ కళ్యాణ్ కొత్త ప్రతివాదన
కరోనా పేరుతో ఏడాదిన్నరగా చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ప్రజల కష్టాల్లో ప్రతిపక్ష నేత పారిపోయారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.. పవన్, చంద్రబాబు కూడా ఏపీకి దూరంగా ఉండడంతో ఈ విమర్శలకు ఆస్కారమిచ్చారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమలతో ప్రజలకు కాస్త భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో తాము సురక్షితంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్రాన్ని వదిలేసిన తీరు మీద జనంలో సదాభిప్రాయం లేదు. అదే సమయంలో కరోనా ప్రభావం కూడా పూర్తిగా తగ్గలేదు. అన్నింటికీ మించి 70 ఏళ్ల పైబడిన వయసులో బాబు ఏమేరకు ముందుకు సాగగలరన్నది సందేహంగా ఉంది.
శారీరంగా చంద్రబాబు దృఢంగానే కనిపిస్తారు. కానీ ప్రజల మద్యలో, సుదీర్ఘకాలం యాత్ర చేయాలంటే అది ఆయనకు భారం అవుతుంది. దాంతో మరో రూపంలో ప్రజల మధ్యకు వెళ్లే ప్రణాళికలను కూడా టీడీపీ ప్రయత్నిస్తోంది. దానికి 2022 ప్రారంభంలో ముహూర్తంగా నిర్ణయించబోతున్నారు. కానీ ఆలస్యంచేస్తే మండువేసవిలో తిరగాల్సి వస్తుందని, ముందుగా ప్రారంభించడమే మంచిదనే వారు కూడా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ ఆగస్టు నాటికి గానీ యాత్ర ప్రారంభించాలనే అంచనాలో ఉన్నారు. కానీ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళితే ఏమిటి పరిస్థితి అనే అనుమానం కూడా టీడీపీలో ఉంది. దాంతో ప్రజా యాత్ర ఆలోచనను అమలులోకి తెచ్చేందుకు తొందర పడుతున్నట్టు కనిపిస్తోంది.
Also Read : రెండున్నరేళ్ల జగన్ పాలన – సమాజం కేంద్రంగా జరుగుతోన్న అభివృద్ధి ఇదే
చంద్రబాబు రోడ్డు మీదకు వచ్చినప్పటికీ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల రీత్యా ఆదరణ ఏమేరకు ఉంటుందన్నది టీడీపీ నేతలు కూడా అంచనాకి రాలేకపోతున్నారు. 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసినప్పటికీ ఆశించిన రీతిలో రాజకీయంగా మార్పులు రాలేదని టీడీపీ నేతలే అంటున్నారు. రాష్ట్ర విభజన మూలంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో అనుభవం, ఆనాటికి బీజేపీ కి సానుకూలత తో వచ్చిన మితృత్వం కలిసి గద్దెనెక్కేందుకు దోహదపడ్డాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం వైఎస్సార్సీపీకి ప్రజాబలం పుష్కలంగా ఉన్న తరుణంలో బాబు యాత్ర ఎటూ , ఎప్పుడు అన్నది టీడీపీ నిర్ధారణకు రాలేకపోతున్నట్టు కనిపిస్తోంది. ఏమయినా మళ్లీ అధికారం ఆలోచనతో చంద్రబాబు చేపట్టే యాత్రకు సామాన్యుల నుంచి స్పందన వస్తుందా లేదా అన్నదే అంతుబట్టక సతమతమవుతున్నట్టు తెలుస్తోంది.