iDreamPost
android-app
ios-app

నేడు జీఎస్టీ మండ‌లి భేటీ : పెట్రోలు, డీజిల్ పై కీల‌క నిర్ణ‌యం?

నేడు జీఎస్టీ మండ‌లి భేటీ : పెట్రోలు, డీజిల్ పై కీల‌క నిర్ణ‌యం?

పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతూనే ఉంది. ప్ర‌ధాని మోదీ ప్ర‌తిష్టపై విమ‌ర్శ‌ల‌కు అవి కూడా ఓ కార‌ణ‌మే. మిగ‌తా వాటి ప‌రిస్థితి ఎలాగున్నా.. పెట్రోలు, డీజిల్ నిత్యావ‌స‌రం. రోజూ పెట్రోలు కొట్టించుకునేట‌ప్పుడు అక్క‌డున్న ధ‌ర‌ను చూస్తూ మెజార్టీ వాహ‌న‌దారులు కేంద్రాన్ని ఒక్క‌సారైనా నిందిస్తార‌న‌డం అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే.. వాటి ధ‌ర‌ల ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై అంత‌లా ఉంటుంది. ఈ ధ‌ర‌ల పెరుగుద‌ల ఫిబ్ర‌వ‌రిలో భార‌త్ బంద్ కు కూడా దారి తీసింది. భారత్ లో పెట్రో ప్రభావం అన్ని రంగాలపై చూపడంతో మోదీ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయింది.

నాడు యూపీఏపై మోదీ గ‌ర్జ‌న‌

న‌రేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగిన‌ప్పుడు నాడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆయ‌న హ‌యాంలో పెట్రో ధ‌ర‌లు చాలా రాష్ట్రాల్లో సెంచ‌రీ దాటిపోవ‌డంపై ప్రతిపక్షాలతోపాటు సామాన్యుల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయంగా క్రూడాయిల్ బ్యారల్ ధరలపై ఆధారపడి ఉంటాయి. ఇండియాలోనూ ఇదే విధానం కొనసాగుతోంది. అయితే క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గినా ఇండియాలో మాత్రం అమలవడం లేదు. క్రూడాయిల్ తో ఎలాంటి సంబంధం లేకుండానే వీటి ధరలను ప్రభుత్వం ఇష్టారీతిన పెంచుకుంటూ పోతుంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే త‌గ్గించ‌క త‌ప్ప‌దా…?

యూపీఏ హయాంలో పెట్రోలు ధర గరిష్టంగా 60 రూపాయలు ఉంటే ఇప్పుడు ఆ రేటు సెంచరీని దాటింది. తాజాగా పెట్రోల్.. డీజిల్ ధరలు ఇంతలా పెరగటానికి కారణం.. పన్ను రేటు కంటే కూడా.. ఎప్పటికప్పుడు వీటి మూల ధరను పెంచుకుంటూ పోవటమే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అంతకంతకూ పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు మహా ఇబ్బందిగా మారింది. ప్రభుత్వంపై సామాన్యుల్లోనూ వ్యతిరేకత అంతకంతకూ ఎక్కువైంది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్ర‌య‌త్నిస్తున్న త‌రుణంలో తనపై వ్యతిరేకత వచ్చిన అంశాలపై ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర ధరలు కూడా పెరిగాయి. ఈ ప్రభావం మోదీ సర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేస్తుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల కట్టడికి మోదీ సర్కారు నడుం బిగిస్తోంది. ఈ నెల 17న జరిగే జీఎస్టీ మండలి భేటీలో ఈ విషయాన్ని చర్చించి కీలక నిర్ణయం ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. కేంద్రం నిజంగానే పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేస్తే ఖచ్చితంగా ధరలు అదుపులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఆ సాహ‌సం చేస్తుందా

ఒకే దేశం.. ఒకే పన్నుల విధానం పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీలోకి మద్యం.. పెట్రోల్.. డీజిల్.. విమాన ఇంధనం లాంటి కొన్నింటిని జాబితాలో చేర్చలేదు. అయితే.. పన్ను ఎక్కువగా ఉండే లిక్కర్.. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ జాబితాలోకి తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. అయితే.. దీనిపై ప్రభుత్వాలు ఆసక్తి చూపించలేదు. జీఎస్టీలోకి చేరిస్తే.. పన్ను ఆదాయం భారీగా తగ్గిపోవటమే దీనికి కారణం. జీఎస్టీలో గరిష్ఠంగా 28 శాతం మాత్రమే పన్ను విధించే వీలుంది. ఒకవేళ.. దీన్ని తీసుకొస్తే.. రాష్ట్రాలతో పాటు.. కేంద్రం కూడా భారీగా పన్ను ఆదాయాన్ని కోల్పోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్ర‌భుత్వం ఆ సాహ‌సం చేస్తుందా అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

ఆ కీల‌క నిర్ణ‌యం ఏంటో..

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్ పై రూ.32.80 డీజిల్ మీద రూ.31.80 ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తోంది. దీనికి అదనంగా రాష్ట్రాలు సైతం పన్ను వసూళ్లను చేపడుతున్నాయి. ఒకవేళ.. వీటిని జీఎస్టీలోకి తీసుకెళితే.. పన్ను 28 శాతానికి మించి వేసే అవకాశం ఉండదు. రాష్ట్రాలు కూడా అదనంగా పన్ను విధింపులకు అవకాశం ఉండదు. అదే జరిగితే.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గటం ఖాయం. మరి.. కీలకమైన పన్ను ఆదాయాన్ని కోల్పోయి మరీ ధరలు తగ్గేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా? అన్నదిప్పుడు ప్రశ్న. మ‌రి నేడు జరిగే జీఎస్టీ మండలి భేటీలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న మాట వినిపిస్తున్న వేళ.. మరేం జరుగుతుందో చూడాలి.