iDreamPost
android-app
ios-app

కమల్‌నాథ్ కోట కూలుతుందా ??

కమల్‌నాథ్ కోట కూలుతుందా ??

మధ్య ప్రదేశ్‌లో కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. కమల్‌నాథ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఓ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే లతో కలిపి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నటుండి మంగళవారం అర్థరాత్రి గురుగ్రామ్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో ప్రత్యక్షమయ్యారు. దీంతో ప్రభుత్వాన్ని కూల్చేందుకే బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి స్టార్ హోటల్ కి తరలించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

బుధవారం ఉదయం సీనియర్ కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మీడియా తో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు హోటల్లో ఉన్నట్టుగా తమకు సమాచారం అందగానే కాంగ్రెస్ నేతలు జీతూ పట్వారీ, జైవర్థన్ హోటల్ కి చేరుకొని సదరు ఎమ్మెల్యేలతో మాట్లాడారని, ఈ సందర్భంగా ఆ ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు వెనక్కి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగానే మాజీ సీఎం శివరాజ్ చౌహాన్, మాజీ మంత్రులు నరోత్తమ్ మిశ్రా, భూపేంద్ర సింగ్, రాంగోపాల్ సింగ్ తదితరులు బలవంతంగా తమ ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే తమ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి బయటకి వస్తే తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 25 కోట్లు ఇస్తామని బిజెపి ఆఫర్ ఇస్తున్నట్టుగా కొందరు ఎమ్మెల్యేలు తనతో చెప్పారని.. ఒకవేళ బిజెపి ఫ్రీగా డబ్బులు ఇస్తామంటే తీసుకోండని మా ఎమ్మెల్యేలతో చెప్పానని కమల్‌నాథ్ పేర్కొన్నారు.

మొత్తం 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 2018 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీలు రెండూ నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్నికల ఫలితాలలో విజయం ఇరుపక్షాల మధ్య చివరి నిమిషం వరకు దోబూచులాడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెలుచుకొని అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కి కేవలం రెండే రెండు సీట్ల దూరంలో నిలబడింది. ప్రతిపక్ష బిజెపి 107 సీట్లు గెలుచుకొని గట్టి పోటీ ఇచ్చింది. దీంతో నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే ఇలా మొత్తం 121 మంది సభ్యుల మద్దతుతో 2018 డిసెంబర్ లో మాజీ కేంద్ర మంత్రి కమల్‌నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

గతంలో వరుసగా మూడు సార్లు మధ్యప్రదేశ్ లో అధికారాన్ని హస్తగతం చేసుకొని తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళుతున్న శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి వరుస కరువులు, గిట్టుబాటు ధరలుకోసం రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయడం.. ఇలా రైతుల నుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకత వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారాన్ని కోల్పోవాల్సివచ్చింది. ముఖ్యమంత్రి పదవికోసం కాంగ్రెస్ లోప్రముఖ రాజవంశాలకు చెందిన దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్ జ్యోతిరాదిత్య సింధియాలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ చివరికి కాంగ్రెస్ అధిష్టానం గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేంద్ర మాజీ మంత్రి కమల్‌నాథ్ వైపే మొగ్గు చూపింది.

అయితే అధికారం చేపట్టిన నాటినుండి ఈ 16 నెలల్లో కమల్‌నాథ్ స్వపక్షం నుండే తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నాడు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా ల నేతృత్వంలో మూడు వర్గాలుగా విడిపోవడంలో కాంగ్రెస్ లో లుకలుకలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 29 ఎంపీ సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 28 స్థానాల్లో ఘోరంగా ఓడిపోయి తీవ్ర అవమానాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో సింధియాల కంచుకోట ఐన ‘గుణ’ పార్లమెంట్ లో సైతం జ్యోతిరాదిత్య సింధియా ఓడిపోవడంతో తన ఓటమికి ముఖ్యమంత్రి కమల్‌నాధే కారణమని జ్యోతిరాదిత్య కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో ఒకదశలో జ్యోతిరాదిత్య ముఖ్యమంత్రి పీఠం నుండి కమల్‌నాథ్ ని గద్దె దించడానికి బిజెపి తో చేతులు కలపడానికి సిద్ధపడినట్టు మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఐతే ఈ వార్తలను జ్యోతిరాదిత్య తోసిపుచ్చాడు. మొదట్లో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కి మరో సీనియర్ నాయకుడు దిగ్విజయసింగ్ మద్దతు ఇచ్చాడు. అయితే ఇటీవలి కాలంలో కమలనాధ్, దిగ్విజయ్ మధ్య కూడా తీవ్ర అభిప్రాయ బేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 2019 లో జరిగిన కర్ణాటక పరిణామాల్లో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసి యడియారుప్పని ముఖ్యమంత్రి కుర్చీలో కుర్చోపెట్టాక ఇక అమిత్ షా నెక్స్ట్ టార్గెట్ మధ్యప్రదేశేనంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఒకపక్క వరుస ఓటములు, నాయకత్వ సంక్షోభంతో ఢిల్లీలో కాంగ్రెస్ పరిస్థితి ఎప్పుడు లేనంత బలహీనంగా తయారయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యేల క్యాంప్ వార్తల నేపథ్యంలో బొటాబొటి మెజారిటీతో నెట్టుకొస్తున్న కమలనాధ్ ప్రభుత్వం ఈ తాజా రిసార్ట్ రాజకీయాలను తట్టుకొని నిలబడుతుందా ?? కమలం పెద్దల ఆపరేషన్ ఆకర్ష్ నుండి తమ సొంత ఎమ్మెల్యేలను కాపాడుకొని ఈ సంక్షోబం నుండి గట్టెక్కుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.