Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
పిల్లల ప్రాణాల మీద, వారి భవిష్యత్తు మీద మమకారం, బాధ్యత ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని అనుకున్నామని.. ఇందుకోసం కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తలు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని ప్రజా ప్రభుత్వంగా పరిగణనలోకి తీసుకుని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. మే 5 నుంచి 19 వరకు జరగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. పరీక్షల మెటీరియల్‌ను సంబంధిత కేంద్రాలకు ఇప్పటికే పంపించింది. జిల్లాకు ఒకరు చొప్పున 13 మంది కొవిడ్ స్పెషల్ అధికారులను నియమించింది. కేంద్రాల వద్ద స్క్వాడ్లు, మొబైల్ మెడికల్ వ్యాన్లు, థర్మల్ స్కానర్లు, మాస్కులు అందించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది.
విద్యార్థుల భవిష్యత్తు, భద్రత ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సీఎం జగన్ ఇంటర్ పరీక్షలు నిర్వహించెందుకే మొగ్గు చూపారు. ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలను రద్దు చేయలేదు. అన్ని విధాలా ఆలోచించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే విద్యార్థులు, పరీక్షలను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని విపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. హై కోర్టు లో కేసులు కూడా వేశారు. ఎన్ని విధాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 14 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కేసులు మాత్రం తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో భేషజాలకు పోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసుల తీవ్రత తగ్గితే పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే 10వ తరగతి, డిగ్రీ పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది.