సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేవాళ్ళకు షార్ట్ వీడియోల గురించి బాగా తెలుస్తుంది. ఇక ఇన్ స్టాగ్రామ్(Instagram) లాంటి వేదికల్లో రీల్స్ కు ఉన్న ప్రాధాన్యతే వేరు. నిత్యం యూజర్ల ఫీడ్ బ్యాక్ ను తీసుకునే ఇన్ స్టాగ్రామ్ ఇప్పుడు అనూహ్యంగా కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది.
ఇక మీదట 15 నిమిషాల లోపు నిడివి ఉండే ప్రతి వీడియో కంటెంట్ కూడా రీల్స్ గానే షేర్ అవుతాయని తెలిపింది. ఇప్పటివరకు 1నిమిషం వ్యవధి లోపు ఉన్న వీడియోలనే రీల్స్ గా పరిగణిస్తూ వచ్చింది ఇన్ స్టా(Insta). నిమిషం దాటిన వాటిని సాధారణ వీడియోలుగా చూపించేది.
ఈ ఫీచర్ తో రెగ్యులర్ గా ఇన్ స్టా వాడే వారిలో కొత్త సందేహం కనిపిస్తోంది. అదేంటంటే.. మరి ఇప్పటివరకు పోస్ట్ చేసిన వీడియోల పరిస్థితి ఏంటి? అని. దీనికి కూడా సమాధానం చెప్తోంది ఇన్ స్టా. గతంలో పోస్ట్ చేసిన వీడియోలు అలాగే ఉంటాయని, కొత్తగా 15 నిమిషాల కంటే తక్కువ నిడివి ఉన్న వాటిని పోస్ట్ చేస్తేనే అవి రీల్స్ గా యాప్ లో షేర్ అవుతాయని తేల్చేసింది. ృ
ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్, మరికొన్ని రోజుల్లో యాప్ లో కనిపిస్తుందని చెప్తోంది. దీని వల్ల మీ అకౌంట్ ప్రైవేట్ గా ఉంటే మీరు అప్ లోడ్ చేసే రీల్స్ ను కేవలం మీ ఫాలోవర్స్ మాత్రమే చూడగలరు. కొంతమంది యూజర్లు రీల్స్ కు బదులు వీడియోలను అప్ లోడ్ చేయడానికి ఇష్టపడతారు. దాని ద్వారా తమవారితో సమాచారాన్ని పంచుకుంటారు. ఇలాంటి వారు ఇన్ స్టాలోని కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత వారి అభిరుచికి తగ్గట్లుగా సెట్టింగ్స్ లో మార్పులు చేసుకోవచ్చు.
ఈ కొత్త మార్పులకు కారణం.. ఇన్ స్టాగ్రామ్ ను వీడియో ప్రధాన యాప్ గా మార్చే దిశగా చర్యలు తీసుకోవడమే అని తెలుస్తోంది. మొత్తంగా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మరిన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉంది.