iDreamPost
iDreamPost
భారత నావికాదళ విమాన వాహక నౌక ,ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించిన వేళ ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న కీలకమైన ప్రశ్న ఒక్కటే. చైనా నౌకాదళానికి వ్యతిరేకంగా భారత నావికాదళానికి విక్రాంత్ ఎంతటి బలాన్ని ఇవ్వగలదు? చైనాను సముద్రజలాల్లో అడ్డుకోగలమా? అవసరమైతే ఎదురుదాడిచేయగలమా?
భారతదేశం మొదటి స్వదేశీ విమాన వాహక నౌకను బరిలోకి దింపడమంటే నౌకాదళానికి రెండువైపులా రెండు విమాన వాహక నౌకలను అందించడమే. దేశ సముద్ర రక్షణలో INS విక్రమాదిత్య ఒకవైపు కాపుకాస్తోంది. అంతర్జాతీయ యుద్ధవిన్యాసాల్లో పాల్గొంటోంది. భారత నౌకాదళంతో పోలిస్తే, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (PLAN)కి మూడు యుద్ధ విమాన వాహక నౌకలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాకు రెండు విమాన వాహక నౌకలు- INS విక్రాంత్( INS Vikrant) INS విక్రమాదిత్య( INS Vikramaditya). అదే చైనాకు మూడు- ఫుజియాన్ Fujian, షాన్‌డాంగ్ Shandongతోపాటు లియానింగ్ Liaoning ఉన్నాయి.
విక్రాంత్ తయారీతో ప్రపంచానికి ముఖ్యంగా చైనాకు ఇండియా ఒక సందేశమిచ్చింది. అత్యాధునిక యుద్ధవిమాన వాహన నౌకను సొంతంగా తయారుచేసుకొనే సత్తా ఉన్నదేశాల్లో ఇండియాకూడా చేరింది.
ప్రపంచంలో కనీసం ఒక యుద్ధ విమాన వాహక నౌకకున్న దేశాలు 14 మాత్రమే. ఇందులో ఆరు దేశాలకే విమాన వాహక నౌకను నిర్మించగల సామర్థ్యం, టెక్నాలజీ ఉన్నాయి. ఈ ఆరింటిలో భారతదేశం సగర్వంగా నిలబడింది.
భారతదేశానికి INS విక్రాంత్ ఎందుకంత అవసరం? INS విక్రాంత్ హిందూ మహాసముద్ర ప్రాంతం (IOR)లో చైనాకు వ్యతిరేకంగా అడ్డుగోడకట్టకలదు. అమెరికాలాంటి మిత్ర దేశాలకు రక్షణనివ్వగలదు.
భారతదేశ సరిహద్దుల చుట్టూ మాత్రమేకాదు హిందూ మహాసముద్రం , దాని చుట్టుపక్కల చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) కదలికలతో రెండు దేశాల మధ్య ఘర్షణకు దారితీసే పరిస్థితులున్న సమయంలో, అదునుచూసి విక్రాంత్ నీలిజలాల్లోకి వచ్చింది. INS విక్రాంత్ ప్రవేశంతో, భారతదేశం తూర్పు, పశ్చిమ సముద్రతీరంలో ఒక్కొక్కటి విమాన వాహక నౌకను మోహరించగలదు. ఒకేసారి రెండు శత్రుదేశాలకు ఎదిరిస్తూ, తన సముద్ర ఉనికిని విస్తరించుకోగలదు.
ఇండియాకు రెండు వైపులా విస్తారమైన మహాసముద్రాలున్నాయి. ప్రతి సముద్ర తీరంలో ఒక వాహక నౌక రానుంది. అంటే రెండువైపుల ఎప్పుడూ యుద్ధసన్నిద్ధంగా ఉన్నట్లే. యుద్ధవిమాన నౌక ఉందంటే, పదుల కొద్ది యుద్ధ విమానాలను మోసుకెళ్లడమేకాదు, తమ నౌక శక్తిని ప్రొజెక్ట్ చేయడం, సముద్రజలాల్లో శత్రువును నియంత్రించడమే.
వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ వార్‌షిప్స్ (2022) ప్రకారం, గ్లోబల్ నావల్ పవర్స్ ర్యాంకింగ్ 2022లో అమెరికా తర్వాత చైనాది రెండవ స్థానం. భారతదేశం ఏడవ స్థానంలో ఉంది. త్వరలోనే ఇండియా రెండు స్థానాలను ఎగబాకడానికి సిద్ధమవుతోంది.
భారత వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను చైనా యుద్ధవిమాన వాహక నౌక ఫుజియాన్‌తో పోల్చడం సరికాదు. రీజన్ ఒక్కటే. INS విక్రాంత్ స్కీ-జంప్ రకమైన టేకాఫ్ మెకానిజముంటే, చైనీస్ ఫుజియాన్ కు మరోవిధమైన కాటాపుల్ట్ రకం టేకాఫ్ మెకానిజం ఉంది. దానివల్ల బరువైన విమానాలను ప్రయోగించొచ్చు. విక్రాంత్‌ను చైనాకు చెందిన రెండవ విమాన వాహక నౌక షాన్‌డాంగ్‌తో పోల్చుతున్నారు నౌకాదళ నిపుణులు.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఉనికిని అడ్డుకొనేందుకు భారత నౌకాదళానికి మూడు విమాన వాహక నౌకలు అవసరమని సదరన్ నేవల్ కమాండ్ (SNC) చీఫ్ వైస్ అడ్మిరల్ MA హంపిహోలీ చెప్పారు. ఇప్పటికే రెండు ఉన్నాయి. మరోకటి సిద్ధమవుతోంది. అంటే భారతదేశంకూడా నౌకాశక్తిగా ఎదుగుతున్నట్లే.