iDreamPost
iDreamPost
విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ కార్యకలాపాల ప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఆగస్టు నుంచే సేవలందించేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది. ఆ దిశగా సంస్థ అడుగులు వేస్తోంది. ముందుగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఓ ప్రైవేటు నిర్మాణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, అక్కడి నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టాలని ఇన్ఫోసిస్ భావిస్తోంది. అందుకు తగిన స్థలం కోసం విశాఖలో అన్వేషిస్తోంది. విశాఖలో ఏర్పాటు చేసే కార్యాలయంలో 750-800 మంది ఉద్యోగులు పనిచేసేలా అనువైన స్థలం కోసం సంస్థ ప్రతినిధులు అన్వేషణ మొదలుపెట్టారు. విశాఖ నుంచి ఇన్ఫోసిస్ సేవలు మొదలైతే రెండు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగుల కష్టాలు తీరనున్నాయి.
తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఉద్యోగులతో పాటు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు సైతం హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసర ఉండదు. విశాఖ నుంచి కార్యకలాపాలు మొదలైతే.. వారంతా విశాఖ నుంచే పనిచేసుకునే అవకాశం కలగనుంది. కాగా.. ఇన్ఫోసిస్ ఇంతవరకూ తన సొంత నిర్మాణాల్లోనే సేవలు అందించింది. కానీ.. తొలిసారి నాలుగు ప్రాంతాల్లో తొలిదశలో ప్లగ్ అండ్ ప్లే ద్వారా సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖలో తొలి ప్లగ్ అండ్ ప్లే కార్యాలయానికి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. కరోనా కారణంగా చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేస్తున్నారు. కరోనా తగ్గుతున్న క్రమంలో మళ్లీ ఆఫీసులకు వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితులు ఉండటంతో.. ఉద్యోగులను మెట్రో నగరాలకు రప్పించే కంటే రాష్ట్రంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇన్ఫోసిస్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపింది.
అందుకు తగిన వాతావరణాన్ని కల్పిస్తామని భరోసా ఇవ్వడంతో ఇన్ఫోసిస్ సంస్థ విశాఖ కేంద్రంగా సేవలు అందించేందుకు ఆసక్తి చూపించింది. ప్రస్తుతానికి విశాఖలో తాత్కాలిక భవనంలో కార్యకలాపాలు మొదలైనా.. భవిష్యత్ లో సంస్థ సేవలను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫోసిస్ సంస్థకు స్థల కేటాయింపులు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఇన్ఫోసిస్ రాకతో విశాఖలో ఐటీ రంగానికి బాటలు పడుతున్నాయి.