Idream media
Idream media
మూడు రాజధానుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదనే వారికి ఇదొక కనువిప్పు. న్యాయరాజధాని రాయలసీమలోని కర్నూలులో ఏర్పాటు చేయడం వల్ల ఏమి వస్తుంది..? హైకోర్టు అక్కడ పెట్టడం వల్ల నాలుగు జెరాక్స్ యంత్రాలకు పని ఉంటుదంటూ అవహేళన చేసిన వారికి చెప్పపెట్టులాంటిది. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతాయనేందుకు ఇదోక నిదర్శనం. కర్నూలు నుంచి మూడు నగరాలకు విమాన సర్వీసులు నడపబోతున్నట్లు ఇండిగో విమాన సంస్థ ప్రకటించింది. కర్నూలు నుంచి విశాఖపట్నం, బెంగుళూరు, చెన్నై నగరాలకు నూతనంగా సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు ఇండిగో పేర్కొంది.
న్యాయరాజధాని ప్రస్తావన..
విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు ప్రకటన చేసిన ఇండిగో సంస్థ.. అందులో న్యాయరాజధాని ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించింది. కర్నూలు న్యాయ రాజధానిగా అవిర్భవించబోతున్న నేపథ్యాన్ని, హైదరాబాద్–బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు అంశాల నేపథ్యంలో తమ సంస్థ విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు పేర్కొనడం గమనార్హం. వచ్చే నెల 28వ తేదీ నుంచి వారంలో నాలుగు రోజులు సర్వీసులు తిప్పబోతున్నట్లు వెల్లడించింది.
విమర్శలకు చెక్ పెట్టేలా…
ఒకే రాజధానిలో అన్ని ఒకే చోట ఉంటే.. అందరికీ ఉపయోగంగా ఉంటుంది. మూడు రాజధానులతో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు చోట ఏర్పాటు చేస్తే.. అనుసంధానం తప్పుతుందనే వారి విమర్శలకు ఇండిగో తీసుకున్న నిర్ణయం సమాధానం చెప్పినట్లైంది. పరిపాలన వికేంద్రీకరణ వల్ల.. అభివృద్ధి సాధ్యం అవుతుందని, ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గుతాయనే వాదనకు ఈ పరిణామం సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే చాలని.. అభివృద్ధి దానంతట అదే జరుగుతుందని తాజా పరిణామం చాటిచెబుతోంది.
ప్రస్తుతం మూడు రాజధానుల అంశంపై కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. ఇవి పరిష్కారం అయిన వెంటనే మూడు రాజధానులను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్.. మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. మూడు రాజధానుల ఏర్పాటు తర్వాత ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఏపీ ముఖ చిత్రం మారే పరిస్థితులు ఏర్పడతాయనేందుకు ఇండిగో నిర్ణయం ఒక సూచికగా పరిగణించవచ్చు.