iDreamPost
android-app
ios-app

హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురు దెబ్బ

హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురు దెబ్బ

జమ్మూ కాశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నెల 16న కాశ్మీర్‌లోని కుల్గాంలో సీఆర్‌పీఎఫ్‌, జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ రియాజ్ నైకూను తుదముట్టించిన సంగతి తెలిసిందే. నేటి తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పులలో హిజ్బుల్ ముజాహిదీన్ చెందిన టాప్ కమాండర్‌తో పాటు మరో ఉగ్రవాది మరణించాడు. తాజాగా శ్రీనగర్‌లోని నవకడల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అందించిన సమాచారంతో భద్రతా దళాలు,జమ్ము కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను సోమవారం రాత్రి ప్రారంభించింది.

భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు తొలుత కాల్పులు మొదలుపెట్టారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు హిజ్బుల్ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు ఆశ్రమం పొందిన రెండు ఇళ్లను భద్రతా దళాలు పేల్చివేసినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో ఒక పోలీస్ కానిస్టేబుల్ వీరమరణం పొందాడు. మరో పోలీస్ అధికారి, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఒక జవాన్ గాయపడ్డారు.

ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులలో ఒకడు కశ్మీర్ వేర్పాటువాద తెహ్రీక్-ఇ-హురియత్ అధ్యక్షుడు మహమ్మద్ అష్రాఫ్ షహ్రాయ్ చిన్న కుమారుడు జునైద్ అష్రఫ్ షహ్రాయ్‌గా అధికారులు గుర్తించారు. ఇతను హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్‌గా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. నవాకడల్ ప్రాంతంలో ముంద జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపివేసింది.