iDreamPost
android-app
ios-app

Covid Outbreak : దేశంలో ఒక్కరోజులో 17 వేలకు పైగా కేసులు..మూడు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్

  • Published Jun 24, 2022 | 10:06 AM Updated Updated Jun 24, 2022 | 10:06 AM
Covid Outbreak : దేశంలో ఒక్కరోజులో 17 వేలకు పైగా కేసులు..మూడు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్

భారత్ లో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. చూడబోతే దేశంలో ఫోర్త్ వేవ్ మొదలైనట్లే కనిపిస్తోంది. గడిచిన 15 రోజులుగా.. నిన్న మొన్నటి వరకూ రోజువారీ కేసులు 10 వేల నుంచి 14 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ లో 17 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల తర్వాత ఈ స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవ్వడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలలో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

గత 24 గంటల్లో దేశంలో 4,01,649 శాంపిళ్లను పరీక్షించగా.. 17,336 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే.. నేటి కేసులు 30 శాతం అధికంగా నమోదైనట్లు పేర్కొంది. వీటితో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 88,284కు పెరిగింది. ఇదే సమయంలో కరోనా నుంచి 13,029 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్ ను జయించిన వారి సంఖ్య 4 కోట్ల 27 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో మరో 13 మంది కరోనాతో చనిపోగా.. కరోనా మృతుల సంఖ్య 5.25 లక్షలకు పెరిగింది.

ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మహారాష్ట్రలో అత్యధికంగా 5,218 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో సగంకేసులు ఆర్థిక రాజధాని అయిన ముంబైలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో ముంబై లో 2,479 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.