iDreamPost
android-app
ios-app

వర్ణవివక్ష మీద విజయం సాధించిన అమెరికా మహిళ

వర్ణవివక్ష మీద విజయం సాధించిన అమెరికా మహిళ

బ్రిటిష్ వారి మీద అహింసాయుత మార్గంలో పోరాటం నడిపిన మహాత్మాగాంధీ ఎంచుకున్న రెండు ప్రధాన ఆయుధాలు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ. గాంధీ మార్గంలో తమ దేశాలలో వర్ణవివక్ష మీద పోరాటం చేసిన యోధులు అమెరికాకి చెందిన మార్టిన్ రూథర్ కింగ్, దక్షిణాఫ్రికాకి చెందిన నెల్సన్ మండేలా కూడా ఇవే ఆయుధాలుగా పోరాటం చేశారు. అయితే గాంధీమార్గం గురించి అవగాహన లేని ఒక నల్లజాతి మహిళ సహాయ నిరాకరణ ఆయుధంగా అమెరికాలో, అలబామా రాష్ట్రంలోని వివక్షాపూరిత చట్టం రద్దు చేసేవరకూ పోరాటం చేసింది.

పందొమ్మిదవ శతాబ్దంలోనే అబ్రహం లింకన్ బానిసత్వాన్ని రద్దు చేసినా, నల్లజాతి వారి పట్ల వివక్ష తొలగిపోలేదు. అది ఇప్పటికీ ఉందని మొన్న జరిగిన నల్లజాతికి చెందిన ఫ్లాయిడ్ జార్జ్ హత్య, ఆ తరువాత ఎగసిపపడిన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం తెలియజేస్తున్నాయి. అయితే ఆరేడు శతాబ్దాల క్రితం వివక్షను సమర్ధించే చట్టాలు కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉండేవి.

దక్షిణాది రాష్ట్రమైన అలబామాలో పబ్లిక్ బస్సుల్లో నల్లజాతి వారికి బస్సు వెనుక భాగంలో కొన్ని సీట్లు ఉండేవి. వారు అందులోనే కూర్చోవాలి. ఒకవేళ తెల్లజాతివారి సీట్లు అన్నీ నిండిపోయి, ఎవరైనా తెల్లజాతి వ్యక్తి బస్సు ఎక్కితే నల్లజాతి వారొకరు లేచి, తన సీటు అతనికి ఇవ్వాలి. అలా చేయకపోతే అది శిక్షార్హమైన నేరంగా 1955 సంవత్సరం మొదట్లో ఒక ఆర్డినెన్స్ చేశారు.

చట్టాన్ని అతిక్రమించిన రోజా పార్క్స్

అదే సంవత్సరం డిసెంబర్ 1న అలబామా రాష్ట్ర రాజధాని మాంట్ గోమరీ నగరంలో ఒక షాపులో దర్జీగా పనిచేస్తున్న రోజా పార్క్స్ అనే నల్లజాతి మహిళ తను పనిచేస్తున్న షాపు దగ్గరకు పోవడానికి ఒక బస్సు ఎక్కింది. అప్పటికే వర్ణవివక్షకు వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ఉన్న రోజా ఒక తెల్లజాతీయుడి కోసం తన సీట్లోంచి లేవమని కండక్టర్ అడిగినప్పుడు తిరస్కరించి లేవలేదు ఆమె. దాంతో ఆ విషయం తన పై అధికారులకు ఆ కండక్టర్ తెలియచేయగా ఆమెను చట్టాన్ని ఉల్లఘించినందుకు ఆమెను అరెస్టు చేశారు.

అంతకు కొన్ని రోజుల ముందు నుంచే కొత్తగా వచ్చిన బస్సు చట్టానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడపాలని భావిస్తున్న నల్లజాతి నాయకులకు రోజా పార్క్స్ అరెస్టు బాగా పనికొచ్చింది. అప్పటికే నల్లజాతి వారి హక్కుల కోసం పోరాడుతున్న మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వంలో నల్లజాతి వారందరూ మాంట్ గోమరీ నగరంలో పబ్లిక్ బస్సులను బాయ్ కాట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

బస్సుల బహిష్కరణ ఉద్యమం ఏకంగా సంవత్సరం పాటు నడిచింది. కార్లున్నవారు తమ కారులో కొందరికి లిఫ్టు ఇస్తే, కొందరు సైకిళ్ళమీద, అదీ లేనివారు కాలినడకన స్కూళ్ళకూ, కాలేజిలకు, పనిచేసే చోటకీ రాకపోకలు సాగించారు. పబ్లిక్ బస్సుల్లో ప్రయాణించేవారిలో డెబ్భై శాతం నల్లజాతీయులే కావడంతో సంవత్సరం పాటు బస్సలన్నీ దాదాపు ఖాళీగా నడిచాయి.

1956 నవంబరు 13న అమెరికా సుప్రీంకోర్టు అలబామా రాష్ట్రంలో బస్సుల్లో వర్ణవివక్షను సమర్ధించే చట్టం రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉందని కొట్టివేసింది. డిసెంబర్ 20న మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వంలో సమావేశమైన హక్కుల సంఘాలు బస్సుల బహిష్కరణ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ పోరాటానికి బీజం వేసిన రోజా వివక్ష లేని బస్సుల్లో మొదటగా ప్రయాణం చేసిన వారిలో ఉంది.

మార్టిన్ లూథర్ కింగ్ హత్య తరువాత కూడా చివరి వరకు నల్లజాతి వారి హక్కుల కోసం పోరాడిన రోజా పార్క్స్ 2005 అక్టోబర్ 24న మరణించింది. ఆమె జీవితాంతం చేసిన పోరాటానికి గుర్తుగా ఆమె భౌతిక కాయం అమెరికా పార్లమెంటు భవనంలో అభిమానుల సందర్శనార్ధం ఉంచాలని సెనేట్ నిర్ణయం తీసుకుంది.