iDreamPost
android-app
ios-app

మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు.. ఇకపై కఠినంగా అమలు..

  • Published Jun 09, 2022 | 6:00 PM Updated Updated Jun 09, 2022 | 6:00 PM
మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు.. ఇకపై కఠినంగా అమలు..

ఇటీవల కాలంలో మద్యం తాగి వాహనం నడిపి యాక్సిడెంట్స్ అయిన సంఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. వారు మరణించడమే కాక వాహనాన్ని ఇష్టమొచ్చినట్టు నడిపి ఎదుటి వారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు. ఇప్పటికే మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు మరింత కఠినం తప్పదు అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.

మద్యం తాగి కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు నడిపి పోలీసులకు చిక్కితే ఇక నుంచి మూడు నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దవుతుంది. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని కఠినంగా అమలు చేయనున్నారు పోలీసులు. ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికితే వారి వివరాలు కోర్టుకు సమర్పించి లైసెన్స్‌ రద్దు చేపించి ఆ ఉత్తర్వులను రవాణాశాఖకు పంపించనున్నారు.

దీనికి సంబంధించి ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదుర్కోవాలి. కోర్టులో ప్రతి కేసూ నమోదవుతుంది. జైలుకు వెళ్తే ఉద్యోగాలు పోతాయి. విద్యార్థులు, యువకులకు ఉద్యోగాలకి, విదేశాలకి వెళ్లాల్సి వస్తే ఈ కేసులు అడ్డొస్తాయి. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దు అవుతుంది. కేసు తీవ్రతను బట్టి శాశ్వతంగా కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇకపై తాగి డ్రైవింగ్ చేయొద్దని తెలిపారు.