iDreamPost
iDreamPost
ఐదు తరాల హీరోలతో సినిమాలు చేసిన నట శిఖరం, ఆరు పదుల సినిమా ప్రయాణం.,ఎనిమిది వందలకు పైగా సినిమాల్లో నటించిన అభినయ కౌశలం కైకాల సత్యనారాయణ ఇకలేరనే వాస్తవం నిజంగానే అబద్దం. ఎందుకంటే వేలాది చిరస్మరణీయ పాత్రల ద్వారా ఆయన ఎప్పటికీ చిరంజీవిగా ప్రతి తెలుగు వారి గుండెల్లో బ్రతికే ఉంటారు
కైకాల జన్మస్థలం కృష్ణా జిల్లాలోని కౌతవరం. ఆయన జూలై 25, 1935న జన్మించారు. గుడ్లవల్లేరులో పదో తరగతి వరకూ, విజయవాడలో ఇంటర్, గుడివాడలో డిగ్రీ చదివారు. కాలేజీ రోజుల్లో ఆయనకు నాటకాలపై ఆసక్తి, అభిరుచి ఏర్పడ్డాయి. నటుడు కావాలని కలలు కన్నారు. ‘బంగారు సంకెళ్లు’, ‘ప్రేమ లీలలు’, ‘కులంలేని పిల్ల’, ‘ఎవరు దొంగ’ తదితర నాటకాల్లో నటించారు. అందులో ‘ఎవరు దొంగ’ నాటకాన్ని ఆచార్య ఆత్రేయ రాశారు. కైకాల పలు నాటక పోటీల్లో పాల్గొన్నారు. ఎన్నో బహుమతులు అందుకున్నారు. వెండితెరకు హీరోగా పరిచయమై అన్నా తమ్ముడు బాబాయ్ మావయ్య విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా లెక్కలేనన్ని పాత్రలకు జీవం పోశారు
కైకాలకు ఇరవై వయసు నిండకుండానే విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో నాటక పోటీలకు వెళ్లారు. ‘ఎవరు దొంగ’ నాటకాన్ని ప్రదర్శించారు. ఆ పోటీలకు అతిథిగా వచ్చిన దర్శకుడు గరికపాటి రాజారావు సినిమాల్లోకి రావాలని ఆహ్వానించగా… డిగ్రీ పూర్తి చేశాక వస్తానని కైకాల చెప్పారు. ఆ తర్వాత స్నేహితుడు కె.ఎల్. ధర్ సలహాతో సినిమా ఛాన్సుల కోసం మద్రాస్ వెళ్లారు. ప్రముఖ దర్శక-నిర్మాత ఎల్.వి. ప్రసాద్ దగ్గర అప్పటికే కె.ఎల్. ధర్ సహాయ దర్శకుడు. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ, కాలం కలిసి రాలేదు. సినిమా మొదలు కాలేదు.విజయం ముందు ఎదురయ్యే పరీక్షలివన్నీ
తెలుగు చిత్ర పరిశ్రమకు కైకాల సత్యనారాయణ పరిచయమైన సినిమా ‘సిపాయి కూతురు’. అందులో ఆయన హీరో. జమునకు జంటగా నటించారు. అయితే… ఆయనకు వచ్చిన తొలి ఛాన్స్ ‘సిపాయి కూతురు’ కాదు, ‘కొడుకులు – కోడళ్లు’. అది ఎల్.వి. ప్రసాద్ తీయాలన్న సినిమా. కానీ, బ్యాడ్ లక్. సినిమా స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత కె.వి. రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘దొంగ రాముడు’లో విలన్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్లు చేశారు. అంతా ఓకే అనుకున్నారు. చివరకు ఆ రోల్ ఆర్. నాగేశ్వరరావుకు అవకాశాలు రావడం అదృష్టం అయితే… హీరోగా చేసిన సినిమాలు ఆశించిన విజయాలుఅందుకోకపోవడం దురదృష్టం. అలాగని, కైకాల కుంగిపోలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ కు డూప్ గా నటించినప్పుడు ఆయనతో స్నేహం ఏర్పడింది
‘కనకదుర్గ పూజా మహిమ’లో కైకాలకు నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసే అవకాశం ఇచ్చారు విఠలాచార్య. ఆ తర్వాత ఎన్టీఆర్ ‘అగ్గి పిడుగు’లోనూ విలన్ వేషం ఇచ్చారు. ఆ తర్వాత వరుస ప్రతినాయకుడి పాత్రలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కైకాల సత్యనారాయణ నంబర్ వన్ విలన్ అయ్యారు. తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. రాముడు, కృష్ణుడు తప్ప ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలు అన్నీ కైకాల పోషించారు. పౌరాణిక పాత్రలు, విలన్ క్యారెక్టర్లు చేస్తున్న కైకాల సత్యనారాయణ కెరీర్లో మరో మలుపు ‘ఉమ్మడి కుటుంబం’. అందులో ఎన్టీఆర్ అన్నయ్యగా అద్భుతంగా నటించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ ‘శారద’ సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కైకాలకు తిరుగులేదని నిరూపించింది.
కైకాల సత్యనారాయణ సినిమా జీవితంలో మేలు మజిలీ అంటే ‘యమగోల’ . ఎన్టీఆర్ హీరోగా తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఆ సినిమాలో యముడిగా కైకాల నటించారు. యముడు అంటే ఇలాగే ఉంటాడేమో అన్నంతగా మెప్పించారు. ఎన్టీఆర్ ‘యమగోల’ నుంచి రవితేజ ‘దరువు’ వరకూ అదే పాత్ర పోషించినా బోర్ కొట్టలేదు. జనాల్లో యముడు అంటే ఆయనే అన్నంతగా ముద్ర పడింది. ‘ప్రేమనగర్’, ‘అడవి రాముడు’, ‘వేటగాడు’, ‘మోసగాళ్ళకు మోసగాడు’, ‘దొంగల వేట’, ‘తాత మనవడు’, ‘తూర్పుపడమర’, ‘నేరము శిక్ష’, ‘సిరిసిరి మువ్వ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘సంసారం సాగరం’, ‘రామయ్య తండ్రి’, ‘జీవితమే ఒక నాటక రంగం’, ‘దేవుడే దిగివస్తే’, ‘సమరసింహారెడ్డి’, ‘బొబ్బిలి రాజా’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘ఒంటరి పోరాటం’… నటుడిగా కైకాల సత్యనారాయణ మెప్పించిన సినిమాలు వందల్లో ఉన్నాయి, కైకాల చివరి సినిమా అరుంధతి ఎన్టీఆర్ కథానాయకుడు, మహర్షి.
నటనకు మాత్రమే పరిమితం కాకుండా నిర్మాతగానూ కైకాల సత్యనారాయణ విజయాలు అందుకున్నారు. రమా ఫిలిమ్స్ ప్రొడక్షన్ నయనార్ మీద తమ్ముడు కె. నాగేశ్వరరావు నిర్మాతగా సినిమాలు తీశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘బంగారు కుటుంబం’ చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు. ‘గజ దొంగ’, ‘ఇద్దరు దొంగలు’, ‘కొదమ సింహం’, ‘ముద్దుల మొగుడు’ చిత్రాలు నిర్మించారు. చిరంజీవి చిత్రాలు కొన్నిటికి సహ నిర్మాతగా వ్యవహరించారు. కైకాలకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. అమ్మాయిలు చెన్నైలో సెటిల్ అయ్యారు. కుమారులు నటులుగా రాలేదు. కానీ నిర్మాణంలో ఉన్నారు. కన్నడ హీరో యశ్ కు రెండో కుమారుడు సన్నిహితులు. కెజిఎఫ్ లో కొంత భాగస్వామ్యం ఉంది
నాయకుడిగా, ప్రతినాయకుడిగా, నటుడిగా, విలనిజంలో వినోదం పండించిన నటుడిగా వెండితెరపై వైవిధ్యానికి మారుపేరుగా ఆయన నిలిచారు. ‘నవసర నటనా సార్వభౌమ’గా పేరు పొందారు. 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం వరించింది. అయితే పద్మ పురస్కారం రాలేదు. ఈ విషయం గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ “నాకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల ఆ అవార్డులు రాలేదు. అయినా ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాను. అదే అన్నిటి కంటే పెద్ద అవార్డు. నాకు అది చాలు” అని అన్నారు. చెక్కుచెదరని స్థానాన్ని తెలుగు నేలపై సంపాదించుకున్నాక వేరే సన్మానాలు వస్తే ఎంత రాకపోతే ఎంత. ఎందుకంటే కైకాల ధన్యజీవులు. సినిమా ఉన్నంత కాలం ఆయన గౌరవం పెరుగుతూనే ఉంటుంది