Idream media
Idream media
నాకు 8 ఏళ్ల వయసు. మా స్కూల్ దగ్గర ఒక పిచ్చోడు వుండేవాడు. భార్యాపిల్లలు కలరాతో పోయారు. మతి చలించింది. బల్లి కనిపిస్తే కొరుక్కుతినేవాడు. పిల్లలం భయపడి చచ్చేవాళ్లం.
“తూర్పు నుంచి విషపు గాలి వస్తోంది. ఎవరూ మిగలరు, మిగల్చదు. పారిపోండి” అనేవాడు. ఒకరోజు ఆయన పోయాడు. విషపు గాలి గురించి మరిచిపోయి పెద్దాడినైపోయా.
రాదు , రాదనుకున్నది వచ్చింది. ప్రపంచాన్ని మూత వేయించింది. చప్పట్లు కొట్టాం, దీపాలు వెలిగించాం. మాస్క్ కట్టుకున్నాం. చేతులు కడుక్కున్నాం. అందర్నీ అనుమానంగా చూశాం. ఆగలేదు. వచ్చేసింది. దొంగ ఎవరింటి తలుపో తడుతాడనుకుంటాం. మనింటికి కూడా వచ్చేశాడు. వస్తాడు కూడా.
నాకు కరోనా పాజిటివ్ అని తెలిసినపుడు నేనేం భయపడలేదు. బకాసురుడి దగ్గరికి వెళ్లాలని తెలుసు. కాకపోతే ఆలస్యమైంది.
ధైర్యంగా వుండు అన్నారు. నా దగ్గరున్నదే అది. వుండకుండా ఎలా వుంటాను. అసలు ఒక మనిషి దేనికి భయపడాలి? దేనికి ధైర్యంగా వుండాలి. భయపడకుండా వుంటే ధైర్యంగా వున్నట్టా? ధైర్యంగా కనిపిస్తే భయం లేనట్టా?
మాట సులభం, రాత సులభం. ఎదుర్కోవడం కష్టం. మృత్యువు భయపడతగింది కాదు అంటాడు నీషే. కానీ అది పరిసరాల్లో తచ్చాడుతున్నప్పుడు? ఏమరుపాటుగా వుంటే మీద పడుతుందని తెలిసినపుడు?
అసలు మనం బతికి వుండాల్సిన సందర్భాల్లో బతికే వున్నామా? చాలాసార్లు చచ్చి బతకలేదా? బతికి చావలేదా?
కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ చూసుకునే సరికి మనం జ్వరంలో వుంటాం. కలలాంటి మెలకువ, ప్రాచీన శిశువు జ్ఞాపకాల్లోకి జారుకుంటూ. ఎవరు మనం? ఎక్కన్నుంచి వచ్చాం? ఎక్కడికి వెళతాం? ప‌్రయాణాలకీ, వేచి వుండడానికి ఏమైనా అర్థముందా! లగేజీ అంతా సర్దుకుని , దాన్ని మరిచిపోయి రైలెక్కేస్తాం.
జ్వరం వస్తూ పోతూ వుంటుంది. గుప్పిళ్ల కొద్దీ టాబ్లెట్లు తినాలి. నువ్వు డయాబెటిక్ జాగ్రత్తగా వుండు, వుండకపోతే చచ్చిపోతావ్, చచ్చిపోతే? ఈ ప్రపంచంలో చావుకి మించిన హెచ్చరిక ఇంకా ఎవరూ కనుక్కోలేదు.
ఐసోలేషన్ అని ప్రత్యేకంగా చెప్పుకుంటాం కానీ, మనం సమూహంలో జీవించడం మానేసి చాలా కాలమైంది. ఎవడి ఏకాంతాన్ని వాడు ప్రేమిస్తున్నాడు.
మనం ఇంతకాలం చదువుకున్న జ్ఞానం, తార్కికత, ఉల్లిగడ్డ, గోంగూర ఏదీ కరోనా ముందు పనికిరాదు. సొంత అభిప్రాయాలు ప్రకటిస్తే మీద పడి రక్కుతుంది. దాని రూల్స్ నువ్వు ఫాలో కావాల్సిందే.
మనల్ని చూసి కూడా జనం భయపడతారు. కరోనా అంటే చిన్నవిషయం కాదు. గది నుంచి బయటికి రానివ్వరు. ఎవరూ లోపలికి రారు. జరుగుబాటుంటే కరోనా కంటే సుఖం లేదు.
కరోనా వల్ల మనకి దేవుడు కూడా కనిపిస్తాడు. ముక్కులో పుల్లతో గెలికినపుడు నాకు కనీసం అరడజను మంది ప్రత్యక్షమయ్యారు.