Idream media
Idream media
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి వలసల భయం పట్టుకుంది. వరుసగా ముఖ్యనేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. కరణం బలరాం, సతీస్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, రెహమాన్, డొక్కా మాణిక్య వరప్రసాద్. కదిరి బాబూరావు తదితర నేతలు ఇప్పటికే ఆ పార్టీని వీడి వైసీపీ గూటికి చేరిపోయారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ రేపో మాపో అధికార పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
వీరి సరసనే ప్రకాశం జిల్లా నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా చేరతారనే ప్రచారం ముమ్మురంగా సాగింది. మీడియా, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై శిద్ధా రాఘవరావు స్పందించారు. మీడియా ముందుకొచ్చారు. తాను టీడీపీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళుతున్నట్లు కొన్ని టీవీ ఛానెళ్లలో వచ్చిందని, తాను టీడీపీలోనే ఉన్నానని, పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు.
రాఘవరావు ఈ ప్రకటన చేసినా.. టీడీపీ శ్రేణుల్లో అలజడి మాత్రం తగ్గలేదు. మీడియా ముందుకు వచ్చిన శిద్ధా కేలవం 30 సెకన్లు మాత్రమే ఉండి.. పొడిపొడిగా ముక్తసరిగా ప్రకటన చేసి వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులకు ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే శిద్ధా వ్యవహారంలో టీడీపీ అధినేతకు ఇంకా నమ్మకం కుదరడంలేదు. అయితే ప్రస్తుతానికి శిద్ధా ప్రకటన చంద్రబాబుకు కొంత ఉపసమనం కలిగించే అంశమని చెప్పవచ్చు.
శిద్ధా రాఘవరావు ప్రకాశం టీడీపీకి ఇప్పుడు పెద్ద దిక్కుగా మారారు. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం పార్టీ మారడంతో పెద్ద నష్టమే జరిగింది. కదిరి బాబూరావు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. శిద్ధా కూడా పార్టీ మారితే టీడీపీకి పెద్ద షరాఘాతమే అవుతుంది. గత ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసిన శిద్ధా ఓడిపోయారు. అంతకు ముందు దర్శి నుంచి పోటీ చేసి గెలిచి చంద్రబాబు కేబినెట్‌లో రావాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
దర్శి స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతను కూడా శిద్ధా స్వీకరించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో శిద్ధా రాజకీయ ప్రత్యర్థి.. బూచేపల్లి కుటుంబం నుంచి బూచేపల్లి వెంకాయమ్మ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఉన్నారు.