ప్రపంచమంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు ఆడుగులు వేస్తోంది. కార్ల తయారీదారులు సైతం ఆ దిశగా మోడల్స్ ను రూపొందిస్తున్నారు. ఇక హ్యుందాయ్ కంపెనీ ఇప్పటికే ప్రీమియం కార్లలో ఎలక్ట్రిక్ వేరియంట్స్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే సరసమైన ధరలో ఒక ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం దేశీయ మార్కెట్ కోసం సరసమైన, చిన్న ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది. తక్కవ ధరకు ఎలక్ట్రిక్ కారును అందించేందుకు కేవలం తయారీలో మాత్రమే కాకుండా, అమ్మకాలు, మార్కెటింగ్, అసెంబ్లింగ్, కారు తయారీ కోసం కావాల్సిన ఇతర వనరులు.. ఇలా అన్నిటిపైనా పూర్తి అధ్యయనం చేస్తున్నట్లుగా సమాచారం.
అయితే ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సరైన సమయంలోనే దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మాత్రం కసరత్తులు చేస్తోంది హ్యూందాయ్. కారుతో పాటు ఛార్జింగ్ కు సంబంధించిన సమగ్ర వసతులపైనా ఆలోచన చేస్తోంది. 2028 నాటికి మొత్తంగా 6 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా చేసుకుంది హ్యుందాయ్. భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు తీవ్ర పోటీ ఉండేలా కనిపిస్తున్న తరుణంలో హ్యుందాయ్ ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాలి.