iDreamPost
iDreamPost
పాన్ ఇండియా రేంజ్ సినిమాలు, వెబ్ సిరీస్ లను చూసుంటారు కదూ. కానీ పాన్ ఇండియా దొంగను ఎప్పుడైనా చూశారా ? చూడకపోతే ఇప్పుడు చూడండి. ఈ పాన్ ఇండియా దొంగను శుక్రవారం కేపీహెచ్ బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై 5 రాష్ట్రాల్లో 95 చోరీ కేసులు నమోదయ్యాయి. భోపాల్ కు చెందిన ముర్తజా అలీ (37) ఆలియాస్ డామర్ పేరుమోసిన దొంగ. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అలీ.. దొంగతనాలకు అలవాటుపడి తన కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టేశాడు. బైక్ లను దొంగిలించడంలో చేయి తిరిగిన దొంగ.
భోపాల్ కు చెందిన ముర్తజా అలీ డిగ్రీ మధ్యలో ఆపేశాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జేబు ఖర్చులకోసం 2006లో భోపాల్ లో 5 బైకులను దొంగతనం చేసి జైలు పాలయ్యాడు. ఆ తర్వాత ఇరానీ గ్యాంగ్ లో చేరి జల్సాలకు మరిగాడు. మహిళల మెడలో ఉండే బంగారు ఆభరణాలపై పడింది అతని కన్ను. అప్పట్నుంచీ 11 ఏళ్లుగా తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దొంగతనాలు చేసి 95 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2016లో చిక్కడపల్లిలో గొలుసు చోరీకి సంబంధించి పీడీ యాక్ట్ కింద 2021 కింద జైలు జీవితం గడిపాడు. జైలులో ఉన్నపుడు అలీ కొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్సకు – ఇద్దరు పిల్లల చదువుకు డబ్బుల్లేక మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు.
ఈ ఏడాది మే నెలలో భోపాల్ లో జీపీఎస్ సిస్టమ్ ఉన్న బైక్ ను దొంగిలించి అమ్మేశాయి. పోలీసులకు తెలిస్తే అరెస్ట్ చేస్తారని హైదరాబాద్ బాటపట్టాడు. నకిలీ గుర్తింపు కార్డుతో సిమ్ తీసుకుని సెకండ్ హ్యాండ్ సెల్ఫోన్ లో వేసి.. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేసి వాటిని అక్కడే పడేస్తారు. సీసీ కెమెరాల్లో కనిపించకుండా కుర్తా – హెల్మెట్ ధరించి 7-10 గంటల మధ్యే దొంగతనాలు చేస్తాడు. పరుగెత్తలేని మహిళలను ఎంచుకుని చైన్లను కొట్టేస్తాడు. ఈ గజదొంగ కోసం 16 రోజులపాటు సీసీఎస్, ఎస్ఓటీ, కేపీహెచ్ బీ, బాచుపల్లి, చందానగర్, మియాపూర్ పోలీసులు 200 సీసీ కెమెరాలను పరిశీలించి.. అరెస్ట్ చేశారు. అతని నుంచి 9 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.