iDreamPost
iDreamPost
పడుతూ లేస్తూ వస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ మరింత భారం కానుంది. పెరిగిన విద్యుత్ చార్జీల చూపుతూ, కొద్దిరోజుల్లోనూ మెట్రో ధరలను పెంచే అవకాశం ఉంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న మెట్రో రైలు నిర్వహణ భారంగా మారింది. నష్టాలు పెరుకుపోయాయని మెట్రో అధికారులు చెబుతున్నారు. అందువల్ల చార్జీల పెంపు తప్పదంట. అలాగని చార్జీల పెంపు అంశాన్ని హైదరాబాద్ మెట్రోరైలు వర్గాలు ధృవీకరించడంలేదు. వేచిచూడాలన్నది వాళ్ల ఉద్దేశంలాగ ఉంది.
కరోనా తర్వాత ఉద్యోగుల రాకపోకలుపెరిగానా అనుకున్నంత మేర ఆక్యుపెన్సీ లేదు. దీనికితోడు విద్యుత్ చార్జీల భారం పెరుగుతోంది. రోజుకు సరాసరిన రూ.50 లక్షల నష్టం వస్తున్నట్లు అంచనా. రెండేళ్ల క్రితం మూడు మార్గాల్లో 4.5 లక్షల ప్రయాణికులతో కళకళలాడిన మెట్రో రైళ్లులో, ప్రస్తుతం 3 లక్షల మందే జర్నీ చేస్తున్నారు. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో రద్దీబాగానే ఉంది. రోజుకు 1.40 లక్షల మంది మెట్రోలో జర్నీ చేస్తున్నారు.
ఇప్పుడు తగ్గిన ఆక్యుపెన్సీతోపాటు పెరిగిన విద్యుత్ ఛార్జీలు మెట్రోను భయపెడుతున్నాయి. మెట్రోకు హెచ్‌టీ5 (బి) కేటగిరీ కింద విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ప్రతి యూనిట్‌కు రూ.5.28 చొప్పున ఛార్జి చేస్తున్నారు. ఈనెల నుంచిప్రతి యూనిట్‌కు రూ.6.57కు పెంచినట్లు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపే అవకాశం ఉందన్నది అంచనా. ప్రస్తుతం, మెట్రోలో కనిష్ట చార్జీ రూ.10 కాగా, గరిష్టం రూ.60. బహుశా కనిష్టం రూ.12కి పెంచి, ఆమేరకు గరిష్ట ఛార్జిని 70కి పెంచొచ్చన్నది మెట్రో అధికారుల అంచనా.