iDreamPost
android-app
ios-app

ఈ భార్యలు మాకొద్దు బాబోయ్.. వట సావిత్రి వ్రతం చేసిన భర్తలు

  • Published Jun 14, 2022 | 12:14 PM Updated Updated Jun 14, 2022 | 12:14 PM
ఈ భార్యలు మాకొద్దు బాబోయ్.. వట సావిత్రి వ్రతం చేసిన భర్తలు

వట సావిత్రి వ్రతాన్ని భర్త దీర్ఘాయువు, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం పాటిస్తారు. వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఉపవాసం ఉంటారు. రావి లేదా మర్రిచెట్టును పూజిస్తారు. కానీ.. ఇక్కడ అందుకు భిన్నంగా తమకు భార్యలొద్దంటూ.. భర్తలు వటసావిత్రి వ్రతాన్ని ఆచరించారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోమవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని వలూజ్ లో కొందరు భార్యాబాధిత భర్తలు ఒకేలాంటి డ్రస్సులు వేసుకుని.. ఈ భార్యలు మాకు ఏడు జన్మలు కాదు కదా.. ఏడు క్షణాలు కూడా మాకొద్దంటూ వటసావిత్రి వ్రతం ఆచరించారు.

భార్యలకు వ్యతిరేకంగా భౌసాహెబ్ సాలుంకే, పాండురంగ్ గండులే, సోమనాథ్ మనల్, చరణ్ సింగ్ గుసింగే, భిక్కన్ చందన్, సంజయ్ భంద్, బంకర్, నట్కర్, కాంబ్లే అనే పురుషులు తమ భార్యలను వ్యతిరేకిస్తూ పౌర్ణమి రోజున ‘వట సావిత్రి పూర్ణిమ వ్రతం’ చేశారు. రావిచెట్టుకు పూజలు చేసి దారాలు కట్టారు. ఈ వింత పూజకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా భార్యాబాధిత సంఘం వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు భరత్ ఫులారి మాట్లాడుతూ.. కొందరు మహిళలు తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను అడ్డుపెట్టుకుని భర్తలను వేధిస్తున్నారని, భర్తలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏకపక్ష చట్టం పురుషులను స్త్రీలకు బానిసలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలతో సమానంగా.. పురుషులకు కూడా సాధికారత కల్పించాలని ఆయన కోరారు.