Idream media
Idream media
ప్రజలతో వినయంగా నడుచుకునే తీరు.. పార్టీ పట్ల విధేయత.. అప్పగించిన బాధ్యతలను విధులను సమర్ధవంతంగా నిర్వహించే నేర్పు.. విపక్షాల కుట్రలను స్పష్టంగా చెప్పగలిగే వాగ్దాటి.. డాక్టర్ సీదిరి అప్పలరాజుకు కలిసొచ్చిన అంశాలుగా చెప్పవచ్చు. వీటి వల్లే రాజకీయాల్లో రికార్డు సృష్టించిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. రెండో సారి మంత్రి అయి పలాస నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్కరికీ దక్కని ప్రాధాన్యం సంపాదించుకున్నారు. వైద్య రంగంలో కొనసాగుతున్న ఆయన అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసి.. సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగినా దక్కని అదృష్ఠాన్ని, ఆదరణను చూరగొన్నారు.
పలాస నియోజకవర్గంలోనే పుట్టి పెరిగిన సీదిరి అప్పలరాజు వైద్య విద్య అభ్యసించారు. పన్నెండేళ్ల పాటు వైద్యుడిగా ప్రజలకు సేవలు అందించారు. వైద్యవృత్తిలో ఉంటూ 2017లో వైఎస్సార్‌సీపీ ఆహ్వానం మేరకు రాజకీయ అరంగ్రేటం చేశారు. పార్టీలో చేరడమే తరువాయి క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు వైఎస్సార్‌సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు జగన్. 2019 ఎన్నికల్లో పలాస నుంచి వైఎస్సార్‌సీపీ తరపున పోటీచేసి 60 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన గౌతు కుటుంబంపై విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు.
కిడ్నీ రోగుల బాధలను సర్కారుకు తెలియజేయడంలో విశేష కృషి చేశారు. నియోజకవర్గంపై గణనీయమైన పట్టు సాధించారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో పాతుకుపోయి ఉన్న నేతల పునాదులు కదిల్చారు. టీడీపీ సీనియర్ నేత గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషపై 16,247 ఓట్ల ఆధిక్యంతో తొలి పర్యాయంలోనే రికార్డు విక్టరీ సాధించారు. అరవై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన గౌతు కుటుంబాన్ని కాదని ప్రజలు సీదిరి అప్పలరాజుకు పట్టంకట్టారు. జూలై 22, 2020న మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. పశుసంవర్థక శాఖ, మత్స్య శాఖ మంత్రిగా కొనసాగనున్నారు.