Idream media
Idream media
ఇందాక ఓ ప్రముఖ చానల్‌లో జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రసంగాన్ని చూస్తూ వింటున్నాను. పవన్ మాటలను తాటికాయంత అక్షరాలతో టీవీ స్క్రీన్‌పై వేస్తున్నారు. వైసీపీ నేతలకు “ఇంకిత” జ్ఞానం లేదు, పదేపదే నా వ్యక్తిగత జీవితం గురించే విమర్శలు చేస్తున్నారని పవన్ చేస్తున్న విమర్శలకు ప్రాధాన్యం ఇస్తూ…బ్రేకింగ్ న్యూస్‌గా స్ర్కోల్ చేస్తున్నారు.
సహజంగానే పవన్ ఏ మాట్లాడినా మీడియా అటెన్షన్ ఉంటుంది. పవన్ విమర్శల్లోని అంశం కంటే ఆ ప్రముఖ చానల్‌లో తాటికాయంత అక్షరాల్లో వస్తున్న ఒక పదం నన్ను ఆకర్షించింది. అదేంటంటే “ఇంకిత “. 18 ఏళ్లపాటు సబ్ ఎడిటర్‌గా పనిచేసిన నాకు ఆ పదం తప్పా, ఒప్పా అనే అనుమానం కలిగింది. నిజానికి ఇంకితం కాదు ఇంగితం అనేది సరైంది అని నా వృత్తి అనుభవం చెబుతోంది. కాని మూడేళ్లుగా సబ్ ఎడిటర్‌గా కాకుండా రాజకీయ వ్యాసాలు రాస్తూ గడుపుతున్న నాలో తప్పొప్పులను గుర్తించే ఇంగితం ఏదైనా పోయిందా అనే అనుమానం తలెత్తింది.
ఆ తర్వాత కాసేపటికే ఇంగితం అని మారుస్తూ బ్రేకింగ్ న్యూస్ కొనసాగించారు. హమ్మయ్య నాలో తెలుగు నైపుణ్యం చచ్చిపోలేదని సంతోషించాను. ఎటూ మాతృభాష గురించి మన రాష్ర్టంలో చర్చోపచర్చలు, రచ్చలు జరుగుతున్నాయి కాబట్టి మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకొందాం.
నిజానికి మనందరికి మాతృభాష తెలుగు అయినంత మాత్రాన మనకు తెలుగంతా తెలుసు అనుకోవడం వేరు, తెలియడం వేరు. మనలో చాలా మందికి తెలుగులో తప్పుల్లేకుండా రాయడం రాదు. తెలుగు మాస్టార్లతో సహా. నేను సబ్ ఎడిటర్‌ను కాబట్టి…పత్రికల్లో వస్తున్న ఒకట్రెండు తప్పుల గురించి చెబుతాను.
చాలా తరచుగా పత్రికల్లో ఒంటెత్తుకు బదులు ఒంటెద్దు పోకడలు అని రాస్తుంటాం. అలాగే ఛందస్సుకు బదులుగా చందస్సు అని, బీభత్సానికి బదులు భీభత్సం అని, పింఛన్లకు బదులుగా ఫించన్లని, చీఫ్ మినిస్టర్‌కు బదులు ఛీప్ మినిస్టర్ అని రాస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే తయారవుతుంది. ఎవరైనా తప్పు రాయాలని ఉద్దేశపూర్వకంగా రాయరు. కాకపోతే భాషపై అవగాహన లేకనే ఇలాంటి తప్పులు దొర్లుతున్నాయి.
ఇతరుల తప్పుల గురించి రాస్తున్న నాకు తెలుగులో తప్పుల్లేకుండా రాస్తావా అని ఎవరైనా ప్రశ్నిస్తే రాయలేననే చెబుతాను. ఏ భాష అయినా నిత్యం సాధన చేస్తే తప్ప రాదు. తెలుగులో తెలిసిన వాటికంటే తెలియందే చాలా ఎక్కువని నమ్ముతున్నాను. కాని జర్నలిజంలో ఉన్న వారికి భాషపై అవగాహన, తప్పుల్లేకుండా రాయాలనే స్పృహ ఉండి తీరాలి. ఎందుకంటే వారు రాసే ప్రతి అక్షరం వేలాది, లక్షలాది మంది పాఠకులకు చేరుతుంది. పత్రికల్లో వచ్చిందంటే అదే సరైందనే గుడ్డి నమ్మకం పాఠక లోకానికి. అందుకే పది మందిని చైతన్యపరిచే వృత్తిలో ఉన్న జర్నలిస్టులకు తప్పనిసరిగా చెక్‌లిస్ట్ ఉండాలి. జర్నలిజం అంటే ఓ ఉద్యమమని, తామొక ఉద్యమకారులమనే దశ నుంచి ఓ ఉద్యోగంగా భావించి వస్తున్న తరంతోనే ఈ సమస్య, ఈ తప్పులు. అంతే తప్ప ఈ వ్యాసం ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో కాదు. తెలుగు భా మాతృభాషపై అనంతమైన వాత్సల్యం పెంచుకున్న మనసు…తెలుగులో వస్తున్న తప్పులను చూస్తూ, చదువుతూ చేస్తున్న మౌన రోదన నుంచి పుట్టిందే ఈ వ్యాసమని వినమ్రంగా విన్నవించుకుంటున్నాను.