iDreamPost
iDreamPost
మహారాష్ట్రలో శివసేన కూటమిని కుప్పకూల్చి బీజేపీయే ప్రభుత్వాన్ని ఎర్పాటుచేస్తుందని అందరూ అనుకున్నారు. బీజేపీకూడా ఆమేరకు ఫడ్నవీస్ కు సమాచారమిచ్చింది. ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎం అనుకున్నారు. అదేంటో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. నేను సీఎంకాదు, షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఫడ్నవీస్ ప్రకటించడంతోనే అందరూ ఆశ్చర్యపోయారు. షిండే తనకు డిప్యూటీగా ఫడ్నవీస్ ను కోరుకున్నారు. సీఎంగా షిండే ప్రమాణ స్వీకారం చేస్తే, డిప్యూటి సీఎంగా, మాజీ సీఎం ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎందుకిలా? బీజేపీ ఎందుకు షిండేని ముఖ్యమంత్రిని చేసింది? కొత్త ముఖ్యమంత్రి చెబుతున్నట్లు బీజేపీది పెద్దమనసా? లేదంటే లోగుట్టు ఎమైనా ఉందా?
ఉద్ధవ్ ఠాక్రే సలహాతో మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ 16 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచారిస్తోంది. వాళ్ల మీద సస్పెన్షన్ రద్దుచేయలేదు. ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేల భవిష్యత్తును సుప్రీం తేల్చనుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవాలంటే పార్టీ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఉండాలి. షిండేకి ఆ మాత్రం బలమున్నా, వాళ్లు స్వతంత్రంగా ఉండటం కష్టం. అందువల్ల షిండే టీంకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి బీజేపీలో విలీనం కావడం. లేదంటే మాదే శివసేన అని కోర్టుకెళ్లడం. ఒకవేళ బీజేపీలో విలీనమైతే, వాళ్ల రాజకీయ మనుగడే దెబ్బతింటుంది. వాళ్లు శివసేన నాయకులు కాబోరు.
పోనీ శివసేనను టేక్ ఓవర్ చేద్దామంటే చాలా రాజకీయ, చట్టపరమైన గొడవలున్నాయి. అందుకే బీజేపీ ఈ విషయంలో తలదూర్చాలనుకోలేదు.
శివసేన రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ నమ్మతుందా?
శివసేన అంటే సైద్ధాంతికంగా కట్టుబాటు ఉన్న పార్టీయే. కార్యకర్తలకు చైతన్యం ఎక్కువ. కోపమూ ఎక్కువే. అంతెందుకు షిండే గ్రూపులోనూ రెండు జట్లున్నాయి. ఒకటి, బీజేపీలో విలీనమవుదామంటే, మరో గ్రూపు, శివసేన అన్న గుర్తింపును వదులుకోవడానికి సిద్ధంగాలేదు. అందుకే విలీనం వెనక్కు వెళ్లి, శివసేన పార్టీనే దారికి తెచ్చుకొందామన్న ప్రయత్నం మొదలైంది.
అందుకే బీజేపీలో రెబల్ ఎమ్మెల్యేల మీద కొన్ని సందేహాలున్నాయి. ఎమ్మెల్యేలు తిరుగుబాటుచేసినా, కేడర్ మాత్రం ఇంకా ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతుగానే ఉంది.
శివసేన, హిందుత్వంపై గుత్తాధిపత్యం
ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అని బీజేపీ ముందు నిర్ణయించింది. నేతలు, పాత కేబినేట్ మిత్రులందరూ ఫడ్నవీస్ ఇంటికొచ్చి స్వీట్లు తినిపించారు. అంతా బాగానే ఉందన్న సమయంలో, జాతీయ అధ్యక్షుడు కొత్త ఆలోచన చేశారు. ఎన్‌డిఏయేతర ప్రభుత్వాన్ని పడగొట్టి, బీజేపీ ప్రభుత్వాన్ని ఎర్పాటుచేయడం వల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువన్న అంచనాకు జాతీయ నాయకత్వం వచ్చింది. ముందు ఠాక్రేల నుండి సేనను లాక్కోవడమే లక్ష్యంగా చేసుకున్నారు. అందుకే అటు ఫడ్నవీస్, ఇటు షిండే తరచు బాలాసాహెబ్ ఠాక్రే గురించి పదే పదే మాట్లాడారు. రెబల్ ఎమ్మెల్యేలే సిసలైన శివసేన సైనికులని బీజేపీ చెప్పాలనుకొంటోంది.
బిజెపికి వ్యతిరేకంగా తన హిందుత్వ వాదనను వినిపించే ప్రయత్నం చేసిన ఠాక్రే ఫెయిల్ అయ్యాడు. మహారాష్ట్రలో బీజేపీకి ఇప్పుడు హిందుత్వంపై పూర్తి గుత్తాధిపత్యం వచ్చింది.
అసలు సీఎం ఎవరన్నదానిపై మోదీ, అమిత్ షాకు పెద్దగా పట్టింపులేదు. వాళ్ల టార్గెట్ 2024 ఎన్నికలు. అందుకే ఫడ్నవీస్‌కు బదులుగా షిండేను నియమించడం మోడీ – అమిత్ షాల వ్యూహని అని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఫడ్నవీస్ సీఎం ఆశలకన్నా, మోడీ-షా మిషన్ 2024కే బీజేపీలో ప్రాధాన్యత ఎక్కువ.
షిండేను ముఖ్యమంత్రిని చేసిన బీజేపీ ప్రాంతీయ పార్టీలకు హెచ్చరిక జారీచేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మీరు తిరుగుబాటు చేయండి, బీజేపీ మిమ్మల్ని సీఎం చేస్తుందని భారీ ఆఫర్ ఇచ్చినట్లేనని అంటున్నారు. వారసత్వంకాదు, సాధారణ నేతలకూ బీజేపీ అవకాశమిస్తుందని రాజకీయ పార్టీలకు సందేశం ఇచ్చినట్లే. ఇది బీజేపీ ఇచ్చిన ఇంకో సందేశం.