చరిత్రనేది ఒక నిరంతర ప్రక్రియ. దానికంటూ ప్రత్యేక ఎల్లలుండవు. శోధించే ఓపిక, శ్రమ ఉండాలే గానీ ప్రతి నిత్యమూ అదొక కొత్త కొత్త పరిచయాలను మన ముందుకు తెస్తుంది, సరికొత్త వాదనలకు తెరతీస్తుంది.
భారత దేశ చరిత్ర ప్రధానంగా శాసనాలు, నాటి సమకాలీన కవుల, రచయితల గ్రంథాలు, విదేశీ యాత్రికుల అనుభవాలు, చారిత్రక ఆధారాల పునాదులపై నిర్మితమై ఉంది. ఇవిగాక స్థానిక పుక్కిట పురాణాలు ఉండనే ఉంటాయి.
అలాగని చరిత్రలో ప్రతి అంశమూ శాసనంగా వేయబడి ఉంటుందా అంటే ఏమో చెప్పడం ఖచ్చితంగా కష్టం. శాసనాలనేవి అతి ముఖ్యమైన విశేషాలకు లేదా ప్రాథాన్యం గల సంఘటనలకు మాత్రమే పరిమితమయ్యుంటది. మరి మిగతా స్థానిక చరిత్ర అంతా ఏమైపొయ్యింది? ఎక్కడ దొరుకుతుంది?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే కల్నల్ కాలిన్ మెకంజీ గారి కైఫియ్యతులు. ఆయన ఈస్టిండియా కంపెనీ ఉద్యోగిగా తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించినప్పటికీ రాయలసీమ స్థానిక గ్రామ చరిత్రలను సేకరించి పుస్తకీకరణ చేయడంలో ఆయన కృషి, శ్రమ కొనియాడదగ్గవి.
ఆ తర్వాత జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు తెలుగు భాషకు విశేష సేవలందించిన సీపీ బ్రౌన్ గారి జ్ఞాపకార్థం కడప కేంద్రంగా ఒక గ్రంథాలయాన్ని స్థాపించి ఆ కైఫియ్యతుల్లోని సమాచారాన్ని ఆధునికీకరించి, ప్రత్యేక సంకలనాలుగా ప్రచురించారు.
ఆయన మరణానంతరం కట్టా నరసింహులు గారు బ్రౌన్ గ్రంథాలయ బాధ్యతలు స్వీకరించి కైఫియ్యతుల మీద విశేష పరిశోధనలు చేశారు చేస్తున్నారు. వాటిల్లో కడప జల్లాకు సంబంధించిన స్థానిక చరిత్రలతో “కైఫియ్యత్ కథలు” గా మన ముందుకు తెచ్చారు.
చరిత్రనేది నిరంతర ప్రక్రియని ముందే చెప్పినట్టు ఆయన తన పరిశోధనని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. అలా కట్టా నరసింహులు గారికి దొరికినదే ఈ కడప జిల్లా బద్వేలు తాలూకా కోనసముద్రం అనే గ్రామ, చెరువు యొక్క
చరిత్ర..
ఆయన పరిశోధన సారాంశం యధాతదంగా…
* *మహా మండలేశ్వర మట్ల కోనమ రాజు **
మట్ల వారి సమాచారం కావ్యాల నుంచి కైఫియ్యతుల నుంచి శాసనాల నుంచి మాత్రమే సేకరించవలసి ఉంది. ఎప్పటికప్పుడు దొరికిన సమాచారాన్ని కూడబెట్టుకుంటూ వారి చరిత్రను నిర్మించవలసి ఉంది.
కోనసముద్రం కడప జిల్లా బద్వేలు ప్రాంతంలో ఉంది. ఈ కోనసముద్రానికి చెందిన కైఫియ్యత్తులు ఆర్ నెంబర్ 1170 స్థానిక చరిత్రలు 47, 48 పేజీల నుంచి దొరుకుతుంది. ఈ కోనసముద్రం ఒక గ్రామం, ఒక చెరువు.
కోనమ రాజు విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న సదాశివ రాయల దగ్గర్నుంచి నక్కలగుంట, గొల్లపల్లి గ్రామాలను నాయంకరంగా స్వీకరించాడు. ఆయన ఈ సమీపంలో దక్షిణంలో గొప్ప చెరువు తవ్వించాడు గ్రామాన్ని నిర్మించాడు. తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. ఆయన పేరు మీద చెరువును, గ్రామాన్ని కోనసముద్రం అని పిలుస్తారు.
ఈ కోనమరాజు ఎవరు? ఈ కైఫియ్యత్తులో ఈయన గురించి మహా మండలేశ్వర మట్ల కోనమ రాజు అని ఉన్నది. మట్ల వారిలో ఈ కోనమరాజు పేర్లు వినిపిస్తాయి. అనంతరాజు తండ్రి ఎల్లమరాజు. ఎల్లమరాజు తండ్రి కోనమరాజు. ఎల్లమరాజు తన భార్యాపుత్రులతో తాడిపత్రి తాలుకా వంగల గ్రామం నుండి రాయచోటి తాలూకా మట్లి గ్రామానికి వలస వచ్చారు. దానికి అప్పటికి రాజకీయ కారణం కావొచ్చు.
మట్ల వంశంలోని వరదరాజు శ్రీక్రిష్ణ దేవరాయలుకు మరో అల్లుడు. మరో అల్లుడు అల్లియ రామరాజుకున్న ప్రాథాన్యం వరదరాజుకున్నట్లు లేదు. ఆదరణ లభించలేదు. క్రిష్ణ రాయలు తర్వాత సదాశివరాయలు రాజ్యంలోకొచ్చాడు. తాళికోట యుద్ధంలో రామరాయలు మరణించాడు. రాజకీయ వైమనస్యం చెదిరిపోయింది.
రామరాయల తమ్ముడు గుత్తి ఎర్ర తిరుమల రాయడు మట్ల వారిని చేరదీశాడు. నాయంకరంగా కొన్ని గ్రామాలనిచ్చి ఉపాధి కల్పించాడు. ఆ వరుసలోనే ఆ కుటుంబంలోని కోనమ రాజు బద్వేలు సమీపంలోని నక్కలగుంట, గొల్లపల్లి గ్రామాలనిచ్చాడు. ఈ కోనమరాజు మట్ల వారే అయి ఉంటాడు.
అట్లే రాయచోటి తాలూకా మట్లి గ్రామంలో ఉన్న ఎల్లమరాజు కుమారుడు తిరుమల రాయనికి ఎర్ర తిరుమల రాయడు చేరదీసి తగిన ఉద్యోగమిచ్చి తన దగ్గరే ఉంచుకున్నాడు. రాజంపేట సమీపంలోని పొందలూరు, పెనగలూరు, పొన్నపల్లి గ్రామాలను నాయంకరంగా ఇచ్చాడు. ఆ కారణంగా ఎల్లమరాజు ఆయన కుమారులు మట్లి నుండి రాజంపేట ప్రాంతానికి తరలివచ్చారు.
రాజకీయ భవిష్యత్తు దొరికిన వెంటనే ఎల్లమరాజు పుత్రుడు ఎర్ర తిరుమల నాయుడు క్రీ.శ 1570లో ఒంటిమిట్ట కోదండరాయునికి పొన్నపల్లి గ్రామన్ని సమర్పించి పొన్నాపల్లి శాసనం వేయించాడు.
ఈ సమాచారం మెకంజీ కైఫియ్యత్తులు కడప జిల్లా ఆరో భాగం 497 పేజీలో ఉంది. ఈ కైఫియ్యత్తులో తన తండ్రి శ్రీమన్మహామండలేశ్వర కేనమరాజు అని పేర్కొని ఉంది.
ఈ ఆధారల ప్రకారం నక్కలగుంట, గొల్లపల్లి గ్రామాలను సదాశివరాయల నుండి నాయంకరంగా పొందిన కోనమరాజు ఎవరోకాదు మట్ల కోనమహామండలేశ్వరుడే. సందేహం లేదు. కాదు అని మరో సమాచారం దొరికేవరకూ దీనినే విశ్వసిద్దాం.
సేకరణ: కట్టా నరసింహులు గారు మెకంజీ కైఫియ్యత్తులు కడప జిల్లా ఆధారంగా..