కమిషనర్‌గా నిమ్మగడ్డనే కొనసాగించాలి : హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌నే కొనసాగించాలని ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆర్డినెన్స్‌ను, జీవోలను రద్దు చేసింది. 213 అధికరణ ప్రకారం ఆర్డినెన్స్‌ను తెచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపింది. వెంటనే నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243కే ప్రకారం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను, ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కొత్త కమిషనర్‌ నియామకం చెల్లదని తెలిపింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను తొలగిస్తూ, సంస్కరణల పేరిట తెచ్చిన ఆర్డినెన్స్, నూతన ఎస్‌ఈసీ కనగరాజన్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తోపాటు ఇతరులు 13 మంది ఏప్రిల్‌ నెలలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ నెల 8వ తేదీన హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు తీర్పు వెలువరించింది.

నిమ్మగడ్డను తాము తొలగించలేదని ప్రభుత్వం పేర్కొనగా.. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ తనకు వర్తించదని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వాదించారు. నిమ్మగడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు, ప్రభుత్వాన్ని కించపరిచేలా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ తదితర అంశాలను ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది.

ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలకు హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పులు, ఆదేశాలు వచ్చాయి. రాజధాని, ఇంగ్లీష్‌ మీడియం, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, మత్తు డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, భూముల విక్రయం తదితర అంశాలపై ప్రభుత్వ లక్ష్యాలకు భిన్నంగా హైకోర్టులో తీర్పులు రాగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల సంస్కరణల కోసం తెచ్చిన ఆర్డినెన్స్‌ను, హైకోర్టు మాజీ న్యాయమూర్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ జారీ చేసిన జీవోలను కూడా తాజాగా హైకోర్టు కొట్టివేయడం గమనార్హం.

Show comments