iDreamPost
iDreamPost
మంచి ప్రతిభ ఉన్న నటుడిగా ఎంత పేరున్నప్పటికీ ఇంకా స్టార్ లీగ్ లోకి చేరుకోలేకపోతున్న సత్యదేవ్ కు బ్లఫ్ మాస్టర్ తర్వాత వచ్చిన పరాజయాలు మార్కెట్ ని బాగా దెబ్బ తీశాయి. తనవంతుగా చాలా కష్టపడుతున్నాడు కానీ దర్శకులు కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్ల కెరీర్ ఆశించినంత వేగంగా ముందుకు సాగటం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రాబోతున్న రెండు పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాయంటే అతని ట్రాక్ రికార్డును బుల్లెట్ వేగంతో తీసుకెళ్లే అవకాశాలున్నాయి. చిరంజీవి గాడ్ ఫాదర్ లో ఆఫర్ రావడం పట్ల అతనెంత ఎగ్జైట్ అవుతున్నాడో చూస్తున్నాం. నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయినా సరే స్క్రీన్ షేరింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.
అందులోనూ నయనతార భర్తగా నటిస్తుండటంతో తమిళ మలయాళంలోనూ గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే సల్మాన్ ఖాన్ క్యామియో చేయడం వల్ల గాడ్ ఫాదర్ ని హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎలాగూ సత్యదేవ్ చేసింది విలన్ వేషమే కాబట్టి అక్కడి ఆడియన్స్ కి రిజిస్టర్ అయ్యే లక్కీఛాన్స్ కొట్టేశాడు. అక్షయ్ కుమార్ రామ్ సేతులోనూ తనది కీలకమైన క్యారెక్టర్. నిన్న వదిలిన టీజర్ ఆల్రెడీ పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తోంది. కార్తికేయ 2 లాగా విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఇస్తూనే రాముడి సెంటిమెంట్ ని జోడిస్తున్నారు. చిరంజీవి మూవీ అక్టోబర్ 5, అక్షయ్ సినిమా అదే నెల 25న వస్తుండటంతో రెండింటి మధ్య ఉన్న గ్యాప్ 20 రోజులే.
ఇవి ప్లస్ అయితే సత్యదేవ్ రిలీజ్ కు రెడీగా ఉన్న రెండు సినిమాలకు బిజినెస్ హెల్ప్ అవుతుంది. కొరటాల శివ సమర్పణలో రూపొందిన కృష్ణమ్మ విడుదల కోసం ఎదురు చూస్తోంది. ప్రోమోలు పాటలు గట్రా మాస్ కి బాగానే రీచ్ అవుతున్నాయి. దీనికి పూర్తి విరుద్ధమైన బ్యాక్ డ్రాప్ లో తీసిన కన్నడ రీమేక్ గుర్తుందా శీతాకాలం ల్యాబ్ నుంచి థియేటర్ దాకా వెళ్లలేక మధ్యలోనే కిందా మీద పడుతోంది. ఇప్పుడు గాడ్ ఫాదర్, రామ్ సేతులు హిట్ అయితే ఆటోమేటిక్ గా తన సోలో హీరో ప్రాజెక్టులకు క్రేజ్ వచ్చేస్తుంది. సక్సెస్ మాత్రమే కనిపించే ఇండస్ట్రీలో సత్యదేవ్ కు ఇప్పుడివి విజయవంతం కావడం చాలా కీలకం. మూడు నెలల్లో నాలుగు సినిమాలు విడుదల కావడమంటే విశేషమే