Dharani
Dharani
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరచయమే. ఇక ఓటీటీల హవా పెరిగిన తర్వాత.. అన్ని భాషలకు చెందిన నటీనటులు.. ప్రేక్షకులకు దగ్గర అవుతున్నారు. ఇక పృథ్వీరాజ్ నటించిన పోలీస్ పోలీస్, లూసిఫర్, కడువా వంటి పలు అనువాద చిత్రలు తెలుగులో కూడా మంచి విజయం సాధించాయి. ఇన్నాళ్లు డబ్బింగ్ మూవీల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయిన ఈ హీరో.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ ‘సలార్’లో మెయిన్ విలన్ పాత్ర ద్వారా నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. సలార్ చిత్రంతో పాటు ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న మరో మలయాళ చిత్రం ‘విలాయత్ బుద్ధ’. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా పృథ్వీరాజ్‌కు యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తోన్నారు. ఆ వివరాలు..
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తోన్న మలయాళ చిత్రం‘విలాయత్ బుద్ధ’ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను మరయూర్ బస్టాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. బస్సులో ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో పృథ్వీరాజ్ జారిపడ్డారు. దాంతో ఆయన కాలికి గాయమైంది. గాయం ప్రభావం ఎక్కువగా ఉండటంతో వెంటనే పృథ్వీరాజ్‌ను కేరళలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. సోమవారం నాడు వైద్యులు ఆయన కాలికి ఆపరేషన్ కూడా నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఆయన 2, 3 నెలలు పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు వైద్యులు. ఈ ప్రమాదంపై పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.
‘విలాయత్ బుద్ధ’ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. కొన్నాళ్లుగా మరయూర్ సమీపంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ సుకుమారన్‌కు గాయమైంది. ఇక ‘సలార్’ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను సెప్టెంబర్ 28న పలకరించనున్నారు. ఈ సినిమాలో ఆయన వరదరాజ్ మన్నార్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ప్రభాస్ హీరోయిజంకు ధీటుగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలనిజం ఉండబోతుందని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. సలార్ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.