Krishna Kowshik
Krishna Kowshik
కొంత మందికి పందాలు కట్టాలంటే భలే సరదా. పందెం కాసి, అందులో గెలిచి ఆనందం పొందుతుంటారు. ఎవరితోనైనా, ఏ విషయంలోనైనా బెట్ కడుతుంటారు. అయితే ఒక్కోసారి ఈ పందాలు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఇప్పుడో వ్యక్తి పందెం కట్టి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 10 నిమిషాల్లో లీటర్ మద్యం గడగడా తాగాలని బెట్ కట్టడంతో.. ఇదే సందు, అదే సందు.. దొరికిందే ఛాన్స్ అనుకుని పందెంలో గెలిచేందుకు ఆత్రుత చూపించడంతో ఊపిరి కోల్పోవలసి వచ్చింది. ఈ ఘటన చైనాలో జరగ్గా.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. యావత్ చైనాను దిగ్భ్రాంతికి గురి చేసింది. చైనాకు చెందిన ఉద్యోగి.. విధి నిర్వహణలో ఉండగానే.. తన బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆగ్నేయ గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్‌లో ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు ఝాంగ్ అనే వ్యక్తి. ఆ కంపెనీ యజమాని.. జులైలో టీమ్ బిల్డింగ్ డిన్నర్‌కు హాజరయ్యాడు. ఆ సమయంలో ఆయన.. ఉద్యోగులకు ఓ పందెం పెట్టాడు. 10 నిమిషాల్లో ఒక లీటర్ మద్యం తాగిన వారికి రూ. 5వేల యువాన్‌లు (భారత కరెన్సీలో రూ. 58 వేలు) ఆఫర్ చేశాడు. స్పందన రాకపోవడంతో వెంటనే రూ. 10 వేల యువాన్‌లు (రూ. 1.15 లక్షలు) ఇస్తానన్నారు. అయినా ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో బెట్ మనీని అమాంతం పెంచేశాడు. ఏకంగా రూ. 20 వేల యువాన్లను (రూ. 2.31 లక్షలు) ఆఫర్ చేశాడు. దీంతో ఝాంగ్ తాను ఈ పందెంలోపాల్గొంటానంటూ ముందుకు వచ్చాడు.
అనంతరం మద్యం బాటిల్ అందించడంతో.. సీల్ తీసి 10 నిమిషాల్లో గటగటా తాగేశాడు. కానీ మద్యం తాగిన వెంటనే ఝాంగ్ కళ్లు తిరిగి పడిపోయాడు. సహోద్యోగులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఒక్కసారిగా మద్యం సేవించడం వల్ల పాయిజనింగ్, ఆస్పిరేషన్ న్యుమోనియా, ఊపిరి ఆడకపోవడం, కార్డియాక్ అరెస్ట్ వంటి కారణాలతో ఝాంగ్ మరణించి ఉంటాడని వైద్యులు తెలిపారు.